ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. ముఖానికి అందం కళ్లు. అయితే, ఆ కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ (నల్లటి వలయాలు) ఏర్పడితే సమస్యగా మారుతుంది. డార్క్ సర్కిల్స్ అందాన్ని తగ్గించడమే కాకుండా అలసటగా, అనారోగ్యంగా కనిపించేలా చేస్తుంది. పని ఒత్తిడి, నిద్రలేమి, హర్మోన్లలో మార్పులు ఇంకా ఎన్నో.. కళ్లపై ప్రభావం చూపుతాయి. అయితే, మనకు ఉండే కొన్ని చెడు అలవాట్ల వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. నల్లటి వలయాలకు కారణమయ్యే ఏడు అలవాట్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నిద్రలేమి
ఈ రోజుల్లో చాలా మంది నిద్రపై అశ్రద్ధ చూపుతున్నారు. ఎలా పడితే అలా నిద్రపోతున్నారు. ఓ టైమ్ అంటూ ఉండటం లేదు. దీంతో నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కళ్ల చుట్టూ చర్మం సన్నగా మారుతుంది. దీంతో రక్తనాళాలు ఎక్కువగా కనిపిస్తాయి. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. చాలా మంది అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోతుంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు. ఈ అలవాటుకు చెక్ చెప్పడానికి రాత్రి త్వరగా నిద్రపోయేలా అలవాటు చేసుకోండి. అంతేకాకుండా రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని గుర్తించుకోండి.
స్క్రీన్ టైమ్
చాలా మందికి ఉన్న ఇంకో అలవాటు స్క్రీన్లకు అతుక్కుపోవడం. అది టీవీ, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఏదైనా కావచ్చు. గంటల తరబడి వీటిని చూస్తూ గడిపేస్తున్నారు. దీంతో స్క్రీన్ టైమ్ పెరిగిపోతుంది. ఈ పరికరాల నుంచి వచ్చే బ్లూ లైట్ కళ్లకు మంచిది కాదు. బ్లూ లైట్ కళ్లను అలసిపోయేలా చేస్తుంది. అంతేకాకుండా డార్క్ సర్కిల్స్‌ను ప్రోత్సహిస్తుంది. డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండాలంటే నిద్రించడానికి కనీసం గంట ముందు స్క్రీన్‌లను చూడటం మానేయండి. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్లను అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేయండి.
నీటి కొరత
శరీరానికి తగినంత నీరు అందకపోయినా ఈ సమస్య వస్తుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల చర్మం పొడిబారడంతో పాటు నల్లటి వలయాలు రావడం మొదలవుతాయి. చాలా మంది నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, హైడ్రేట్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకోసం రోజంతా పుష్కలంగా నీరు తాగడం అలవాటు చేసుకోండి. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల అయినా నీరు తాగండి.
ధూమపానం, మద్యం
ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా హానికరం. ఈ అలవాట్లు చర్మాన్ని దెబ్బతీస్తాయి. రక్త ప్రసరణను తగ్గిస్తాయి. దీంతో కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటానికి కారణమవుతాయి. అందుకే ధూమపానం, ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. ఈ రెండు అలవాట్లని వెంటనే మానేయండి.
టెన్షన్ లేదా ఒత్తిడి
ఈ రోజుల్లో జీవనశైలి, వర్క్ స్టైల్ కారణంగా చాలా మంది టెన్షన్ లేదా ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారు. ఇది ఆందోళనకు కూడా కారణమవుతుంది. ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది. ఈ హార్మోన్ పెరగడం వల్ల చర్మం దెబ్బతింటుంది. కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఒత్తిడికి చెక్ పెట్టడానికి మీ రోజు వారీ దినచర్యలో యోగా, ధ్యానం లేదా ఇతర ఒత్తిడిని తగ్గించే యాక్టివీటిస్‌ను భాగం చేసుకోండి.
చర్మ సంరక్షణలో చేసే తప్పులు
కళ్ల చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అయితే, చాలా మంది చర్మ సంరక్షణ విషయంలో తప్పులు చేస్తుంటారు. చర్మ సంరక్షణ ఉత్పత్తుల్ని అధిక మోతాదులో వినియోగించడం లేదా చర్మాన్ని ఎక్కువగా స్క్రబ్ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ పెరుగుతాయి. ఈ సమస్యను తగ్గించాలంటే కళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తుల్ని మాత్రమే వాడండి. అంతేకాకుండా చర్మాన్ని సున్నితంగా స్ర్కబ్ చేయాలని గుర్తించుకోండి.
మేకప్ తొలగించడం లేదు
చాలా మంది నిద్రపోయే ముందు కూడా మేకప్ వేసుకుంటున్నారు. ఇదే పెద్ద తప్పు. నిద్రపోయే ముందు మేకప్ వేసుకోవడం వల్ల చర్మ రంధ్రాలు బ్లాక్ అవుతాయి. దీంతో, డార్క్ సర్కిల్స్ ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా హెవీ మేకప్ వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను నివారించడానికి మేకప్ పూర్తిగా శుభ్రం చేసుకుని నిద్రకు ఉపక్రమించండి. అంతేకాకుండా ఐరన్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.