జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కుర్నూతల గ్రామానికి జూటూరి దావీదు రాజు(18), మేడాల గోవర్ధన్(18) ఓ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఐపీడీ కాలనీకి చెందిన నల్లదీపి బలరాం(22) మరో బైక్‌పై వెళ్తున్నాడు. అయితే వీరంతా ఏటుకూరు సమీపారానికి రాగానే ప్రమాదవశాత్తూ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి.గమనించిన ఇతర వాహనదారులు సమాచారాన్ని పోలీసులు, 108కు అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌లో వారిని జీజీహెచ్‌కు తరలించే లోపే ముగ్గురు యువకులూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. చేతికొచ్చిన కుమారులు మృతిచెందడంతో గుండెలు పగిలేలా రోదించారు. యువకుల మృతితో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు