కూటమి ప్రభుత్వంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయంటూ వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో మహిళా కళాశాల విద్యార్థిని పై దాడి జరిగిందన్న సమాచారంతో వైయస్ఆర్‌సీపీ నేతలు బాలికను ఆమె కుటుంబ సభ్యులను విశాఖలో మెడికవర్ ఆసుపత్రిలో పరామర్శించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరవు అవుతుందన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో దిశ చట్టం రక్షణగా ఉండేదని, ఫోన్ కదిపితే పోలీసులు రక్షణగా ఉండేవారని గుర్తు చేశారు. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ఘటన పై సమగ్ర దర్యాప్తు చేయాలని, తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబ సభ్యులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.