కేంద్ర 2025-26 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 8వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఆర్థికమంత్రి నిర్మల. దేశమంటే మట్టి కాదోయ్.. మనుషులోయ్ అంటూ గురజాడ పద్యాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. అధిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ఉందని.. ఆరు రంగాల్లో సమూల మార్పులు వచ్చాయన్నారు. రైతులు, మహిళలు, పేదవర్గాల అభివృద్ధే తమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పేదరికం నిర్మూలనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే తమకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు.
పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల పాటు ప్రణాళిక రూపొందించామని.. ప్రయోగాత్మకంగా పీఎం ధన్‌ధాన్య కృషి యోజన తీసుకొచ్చామన్నారు. 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. వలసలు అరికట్టడంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. మూడు రకాల పప్పు ధాన్యాల్లో స్వయం సంవృద్ధి సాధించామన్నారు. బిహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధిక దిగుబడి విత్తనాల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపుతో 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం తీసుకువచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు. పోస్టల్ రంగానికి నూతన జవసత్వాలు తీసుకొచ్చామని.. లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియన్ పోస్ట్ రూపుదిద్దుకుందన్నారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల ద్వారా 36 శాతం ఉత్పాదకత లభిస్తుందన్నారు. స్టార్టప్స్ కోసం రూ.20 కోట్ల వరకు రుణాలు అందజేస్తున్నామని... సూక్ష్మ సంస్థలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులు ఇస్తున్నామన్నారు. అధికంగా కార్మికులు పనిచేసే సంస్థలకు చేయూతనిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.