యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాజాగా ఉపకులపతుల(వైస్ ఛాన్సలర్స్ ) నియామకానికి సంబంధించిన నిబంధనలను సవరించింది . ఇంతకుముందు ఉన్న 2010 నిబంధనల ప్రకారం ప్రొఫెసర్ గా పది సంవత్సరాలు అనుభవం ఉన్న విద్యావేత్తలు మాత్రమే ఈ పదవికి అర్హులు. కానీ, ఇప్పుడు తీసుకువచ్చిన సవరణ ఇతర రంగాల్లో పది సంవత్సరాలు అనుభవం ఉన్న వారిని కూడా ఈ వీసిగా నియమించే అధికారం ఉంది. ఇదివరకు కొన్ని సార్లు విసి నియామక అధికారం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండటం వల్ల రాజకీయ సమీకరణలు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లోనవ్వకుండా కేవలం సమర్థత, అనుభవం ఉన్న వారికే పదవులు వస్తాయని; అలాగే ఇప్పటి వరకు కేవలం బోధక రంగంలో అనుభవం ఉన్న వారినే వీసి పదవులు వరించేవి. కానీ ఇప్పుడు పరిశ్రమల నిపుణులు, పాలనా అనుభవం ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వడం వల్ల విశ్వవిద్యాలయాలలో బహుముఖ అభివృద్ధి సంభవిస్తుందన్న ఆశావాద సంకేతాన్ని కూడా యుజిసి ఈ నిబంధనల ద్వారా స్పష్టం చేసింది. అంతే కాకుండా ఇప్పటివరకు ఒక రకమైన ప్రామాణికత లేకుండా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతి ఉండటం వల్ల కొంత గందరగోళం ఏర్పడుతూ ఉందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు ఒకే రకమైన ప్రమాణాలు పాటించే లక్ష్యంగా కూడా ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్టు కూడా యుజిసి పేర్కొంది. విద్యా వ్యవస్థపై రాజకీయ ప్రభావం, ఒత్తిడి నివారించడానికి విద్యా ప్రమాణాలు పెంచడానికే ఈ కొత్త సవరణలు తెచ్చినట్టు యుజిసి ఈ చర్యను సమర్థించుకుంది.
ఈ కొత్త నిబంధన ప్రకారం ఉపకులపతులను నియామకం ముగ్గురు సభ్యులను ఎన్నుకోవడానికి, ఎంపిక కమిటిని నియమించడానికి అధికారాన్ని చాన్సలర్ లకు అంటే గవర్నర్ లకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వీసిల నియామకం విషయంలో ఎప్పటినుండో రాష్ట్రాలు,గవర్నర్ ల మధ్య వివాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లో గవర్నర్లను చాన్సలర్ లుగా తొలగించే బిల్లుకి పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు ఆమోదం కూడా తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు ఆగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి.
ఈ విషయం మీద రాజ్యసభ ఉప నాయకుడు జాన్ బ్రిట్టాస్, ఈ కొత్త నిబంధనల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విశ్వవిద్యాలయాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందని, ఈ సవరణలు సమాఖ్య స్పూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల అధికారాలపై ఇది అతిక్రమణ కూడా అని ఘాటుగా విమర్శించారు. ఈ కొత్త నిబంధనలను తెలంగాణ, కేరళ, కర్ణాటక,తమిళనాడు సహా పలు దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై స్పందిస్తూ ప్రకటనలు కూడా చేసారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీని గురించి మాట్లాడుతూ, “ఉపకులపతులను నియమించే విషయంలో యుజిసి రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధం”అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర హక్కులకు భంగం కలిగించేలా ఉన్న ఈ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ సందర్భంలో వినిపిస్తున్న ఇంకో వాదన ఏమిటంటే ఇంతకుముందు వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్ కావాలంటే ఐదేళ్ళ అనుభవం, ఐదు పరిశోధనా పత్రాలు సమర్పించాలనే నియమం ఉండేది. కానీ కొత్తగా సవరించిన నిబంధనల్లో ఈ అనుభవ కాలాన్ని, పరిశోధనా పత్రాల సంఖ్యను మూడేళ్ళకు,మూడు పత్రాలకు తగ్గించారు. అలాగే గతంలో పేరున్న జర్నల్స్ లోనే ఈ పరిశోధనా పత్రాలు ప్రచురించబడాలన్న నియమం కూడా ఉండేది. అది కూడా ఇప్పుడు సడలించబడింది. దీని వల్ల విద్యా నాణ్యతా ప్రమాణాలు పడిపోయే అవకాశం ఉందని కొందరు విద్యావేత్తల వాదన.
ఈ కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించడానికి ఇంకో కారణం ఏమిటంటే రాష్ట్రాలు విద్య కోసం ఆదాయ వ్యయంలో ఎక్కువ శాతం ఖర్చు భరిస్తూ ఉంటె, ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం అధికారం మాత్రం పరోక్షంగా కేంద్రం చేతుల్లోకి మారుతుంది. గవర్నర్ లకు ఈ కొత్త నిబంధనల ద్వారా నియామక అధికారం ఇవ్వడం ద్వారా, కేంద్రానికి ప్రతినిధులుగా వ్యవహరించే వారి ద్వారా కేంద్రం పూర్తిగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలని నియంత్రించే అవకాశం ఉండటమే. పరోక్షంగా రాష్ట్ర అధికారాల హరింపు కూడా ఇది. ప్రభుత్వమే కాకుండా తెలంగాణ ఉన్నత విద్యామండలి కూడా ఈ తాజా నిబంధనలను వ్యతిరేకించింది. 90 శాతానికి పైగా బడ్జెట్ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా ఉపకులపతులను కేంద్రం ఎలా నియమిస్తుందని రాష్ట్ర ఉన్నతమండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
మొత్తం మీద విద్యాప్రమాణాలు పెంచడానికి, ఉపకులపతుల నియామకంలో పారదర్శకత ఉండేలా చూడటానికే ఇదంతా అని యుజిసి సమర్థించుకుంటున్నా, ఈ సమర్థనకు అనుకూల వాతావరణం మాత్రం ఇప్పుడు రాష్ట్రాల్లో పెద్దగా కనబడటం లేదు. ఇంత ప్రతికూలత మధ్య వస్తున్న ఈ కొత్త నిబంధనలు చివరకు ఏ పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే!