కూటమి ప్రభుత్వం హయాంలో అప్పులు పెరుగుతున్నాయే తప్ప ప్రజలకు జరిగిన మేలు ఏం లేదని చెబుతూ ప్రెస్‌మీట్ పెట్టిన జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు చేస్తున్న అప్పులు, తప్పులు కారణంగా రాష్ట్రం ప్రతిష్ట దిగజారుతుందని అన్నారు. ఈ అప్పులతో తన సంపద పెంచుకుంటున్న చంద్రబాబు ప్రజలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తికి మళ్లీ ప్రజలు ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించారు. అందుకే తాము అధికారంలోకి వస్తున్నామని చెప్పానని అన్నారు.అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేకపోయానని ఈసారి కచ్చితంగా కార్యకర్తలనను పట్టించుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. వారిని చంద్రబాబు పెడుతున్న బాధలు చూసిన తర్వాత అండగా ఉండాలని నిర్ణయించామన్నారు. ఎలాంటి తప్పులు లేకపోయిన వారిపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్న వారితో కార్యకర్తలకు సెల్యూట్ చేయించడంలో తప్పేముందని ప్రశ్నించారు. అలా చేయకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ మధ్య కాలంలో పార్టీ మారుతున్న వారిపై అడిగిన ప్రశ్నకు జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సాయి రెడ్డి కావచ్చు వెళ్లిపోయిన వాళ్లు కావచ్చు. వెళ్లబోయే వాళ్లు కావచ్చు. ఎవరికైనా వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరింపులు, ప్రలోభాలు కామన్‌గా ఉంటాయని వాటికి నిలబడిన వాళ్లనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. అలా కాకుండా వాటికి భయపడి వెళ్లిపోయిన వాళ్లను పట్టించుకోరని అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఓపిక అవసరమని అన్నారు జగన్. ఇలా దేనికో ఒకదానికి లొంగిపోయి పార్టీలు వీడితే గౌరవం ఉంటుందా అని ప్రశ్నించారు. క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఉండాలని అన్నారు. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే గడిచిపోతాయని తర్వాత మంచి రోజులు వస్తాయన్నారు. కచ్చితంగా ఈ ప్రభుత్వం పోతుందని ధీమా వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ఉన్నవి రెండు పార్టీలేనని ఒకటి అధికార పక్షం రెండోది ప్రతిపక్షం. ప్రతిపక్షంలో ఉన్నది ఒకటే పార్టీ. అలాంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు జగన్. ఈ వివాదం కోర్టులో ఉందని స్పీకర్‌కు నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదని అన్నారు. ముందు ఆయన స్పందిస్తే తమ నిర్ణయం చెబుతామని అన్నారు. సభలో తగినంత సమయం ఇవ్వబోరని అందుకే వెళ్లడం లేదని అన్నారు. ప్రెస్మీట్లో కావాల్సినంత టైం ఉన్నది కాబట్టే పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచామని అన్నారు.
9 నెలల పాటు జరిగిన తప్పులు ప్రజల ముందు ఉంచామని వాటిపై అటు నుంచి సమాధానం చెప్పాలని అన్నారు. ఇలాంటి అంశాలపై చర్చలు జరగాలంటే ఎదురెదురుగా ఉంటేనే సాధ్యం అవుతుందని అనుకోవద్దని అన్నార జగన్. అసెంబ్లీకి వెళ్లకపోతే వేటు వేస్తారు కదా అన్న మాటకు ఏం చేసుకుంటారో చేసుకోమని అన్నారు జగన్. తాము అసెంబ్లీని బహిష్కరించడం లేదని వాళ్లే రావద్దని చెబుతున్నారని కొత్త పాయింట్ తీసుకొచ్చారు.