తన కూతురు అమెరికా వెళ్లిన విషయమే ఇప్పటి వరకూ తెలియదంటున్న ఓ తండ్రి అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులను ఆ దేశం తిప్పిపంపిన విషయం తెలిసిందే. ఆర్మీ విమానంలో వారిని పంజాబ్ లోని అమృత్ సర్ కు చేర్చింది. అందులో పంజాబీలతో పాటు 33 మంది గుజరాతీలు కూడా ఉన్నారు. ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. చాలామంది అమెరికా వెళ్లిన విషయం కూడా ఇంట్లో వాళ్లకు, గ్రామస్థులకు తెలియదని చెప్పడం గమనార్హం. ఎలా.. ఎప్పుడు.. అమెరికా వెళ్లారో తెలియదని కుటుంబ సభ్యులు చెప్పడంపై అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ కు చెందిన నికితా పటేల్ అనే యువతి అమెరికాకు వెళ్లిన విషయం తమకు తెలియదని ఆమె తండ్రి కానుభాయ్ పటేల్ చెప్పారు. స్నేహితులతో కలిసి యూరప్ వెళుతున్నట్లు తన కూతురు చెప్పిందని, నెల క్రితం ఇండియా నుంచి వెళ్లిందని వివరించారు. ఆమెతో చివరిసారి గత నెల 15న ఫోన్ లో మాట్లాడానని, అప్పుడు కూడా తాను అమెరికాలో ఉన్నట్లు చెప్పలేదన్నారు. ఎమ్మెస్సీ పూర్తిచేసిన నికిత ఉద్యోగం కోసం యూరప్ వెళ్లిందనే తనకు తెలుసని, అమెరికా వెనక్కి పంపిన వారిలో తన కూతురు ఉందనే విషయం మీడియా ద్వారానే తెలిసిందన్నారు. దీంతో తాను, తన కుటుంబం షాక్ కు గురయ్యామని, తన కూతురు క్షేమంగా తిరిగి వస్తే చాలని కానుభాయ్ చెప్పారు.కేతుభాయ్ పటేల్ సూరత్ లోని తన ఫ్లాట్ అమ్మేసి ఏడాది క్రితం అమెరికా వెళ్లాడు. తాజాగా పట్టుబడి తిరిగొచ్చాడు. అతడి ఫ్లాట్ అమ్మిపెట్టిన మధ్యవర్తి మీడియాతో మాట్లాడుతూ.. ఇలా అక్రమంగా వెళ్లడం వల్ల ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చారు. అమెరికా వెళ్లాలని అనుకుంటే కేతుభాయ్ చట్టబద్ధంగా వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు కేతుభాయ్ తో పాటు ఆయన కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు.అమెరికా డిపోర్ట్ చేసిన వారిలో గాంధీనగర్ కు చెందిన గోహిల్ కుటుంబం ఒకటి.. కిరణ్ సింగ్ గోహిల్ ఆయన భార్య మిట్టల్ బెన్, కొడుకు హేయాంశ్ లను అధికారులు వెనక్కి పంపించారు. ఈ కుటుంబం గత నెలలోనే అమెరికా వెళ్లడం గమనార్హం. వీరిని వెనక్కి పంపించిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ సింగ్ కుటుంబం అమెరికా వెళ్లిన విషయం గ్రామంలో ఎవరికీ తెలియదని చెబుతున్నారు. కొడుకు, కోడలు, మనవడు అమెరికా ఎప్పుడు, ఎలా వెళ్లారో తమకు తెలియదని కిరణ్ సింగ్ తల్లి చెప్పారు. గడిచిన పదిహేను రోజులుగా కొడుకుతో మాట్లాడలేదని వివరించారు.