చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట సమీప అటవీ ప్రాంతంలో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్ కలెక్టర్(జేసీ) విద్యాధరి, డీఎఫ్‌వో భరణి తదితరులు శుక్రవారం పలుదఫాలుగా పరిశీలించారు. పెద్దిరెడ్డి.. భూములు ఆక్రమించారంటూ వచ్చిన ఆరోపణల క్రమంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో గత శుక్రవారం సదరు భూములున్న ప్రాంతాన్ని జేసీ విద్యాధరి, డీఎ్‌ఫవో భరణి పరిశీలించి సర్వే చేశారు. కానీ, వివరాలు వెల్లడించలేదు.
వారం తర్వాత రెండోసారి జేసీ విద్యాధరి, డీఎ్‌ఫవో భరణి, ఆర్టీవో శ్రీనివాసులు, తహసీల్దార్ జయసింహ, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కొద్ది సేపటికి కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ చేరుకుని అధికారులతో మాట్లాడారు. గంట తర్వాత కలెక్టర్, ఎస్పీ వెళ్లిపోగా మధ్యాహ్నానికి మిగిలిన అధికారులు అక్కడి నుంచి కల్లూరు జడ్పీ బంగళాకు చేరుకున్నారు. భోజనం తర్వాత మరోసారి వ్యవసాయ క్షేత్రం వద్దకు చేరుకుని మళ్లీ పరిశీలించారు. అయితే, ఈసారి కూడా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. అధికారుల పరిశీలన నేపథ్యంలో పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే మార్గాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. సుమారు 5 కిలో మీటర్ల పరిధిలో లోపలికి ఎవరినీ అనుమతించలేదు. ఈ పరిధిలో భూములున్న రైతులను సైతం అనుమతించకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు.