ఎమ్మెల్యే పుల్లారావు కట్టుకథలతో తనపై మళ్లీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారంటూ మాజీ మంత్రి రజిని శనివారం ఆరోపణలు చేశారు. ఎనభై ఏళ్లు పైబడిన తన మామగారిపై కూడా కేసులు పెట్టించి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెన్‌లో ఉన్న తన మరిదిపై కూడా అక్రమ కేసులు పెట్టించారని ప్రెస్‌మీట్‌లో దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, నీకు కూడా కుటుంబం ఉంది గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు. మరో నలభై ఏళ్ల వరకు తాను రాజకీయాల్లో ఉంటానని, ఎక్కడ దాక్కున్నా కచ్చితంగా లాక్కొని వస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. చేసిన ప్రతిదానికీ వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరించారు. కుటుంబం, కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో అభివృద్ధిపై దృష్టి పెడితే ఈ ప్రభుత్వంలో అరాచకాలపై దృష్టి పెట్టారంటూ రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 19 వరకు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలపై తాను దృష్టి పెట్టి ఉంటే పుల్లారావు ఎక్కడ ఉండేవాడో గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. తమ పార్టీ నేతలను జైలుకు పంపిస్తే కచ్చితంగా అదే స్థాయిలో రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి చిలకలూరిపేటలో పేకాట, అక్రమ మైనింగ్, సెటిల్మెంట్లు, అన్యాయాలు పెరిగాయంటూ చెప్పారు.
![]() |
![]() |