ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కివీస్ మాజీ క్రికెటర్, ఓపెనర్.. మార్టిన్ గుప్తిల్ ఊచకోత.. 16 సిక్సర్లతో 49 బంతుల్లో 160 నాటౌట్

sports |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 11:34 PM

అంతర్జాతీయ క్రికెట్లో తన ఆటతో ఎన్నో రికార్డులు సృష్టించిన కివీస్ మాజీ క్రికెటర్, ఓపెనర్.. మార్టిన్ గుప్తిల్ ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా లీగ్ క్రికెట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా అక్కడ గుప్తిల్ తనదైన ఆటతీరుతో చెలరేగిపోతున్నాడు. ఇప్పుడు లెజెండ్ 90 లీగ్‌లోనూ అదే పునరావృతం అయింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. తనలోని బ్యాటింగ్ సామర్థ్యం ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాడు. సోమవారం ఇక్కడ రాయ్‌పూర్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బౌలర్లపై దయాదాక్షిణ్యం లేకుండా విరుచుకుపడ్డాడీ కివీస్ మాజీ విధ్వంసకర ఓపెనర్. కేవలం 49 బంతుల్లోనే 160 రన్స్ చేశాడంటే ఎంతటి ఊచకోతో ఊహించొచ్చు.


లెజెండ్ 90 లీగ్‌లో ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గుప్తిల్.. బిగ్ బాయ్స్ యూనికారీ టీమ్‌పై చెలరేగి ఆడాడు. తన ఓపెనింగ్ పార్ట్‌నర్ రిషి ధావన్ నుంచి చక్కటి సహకారం లభించింది. దీంతో నిర్ణీత 15 ఓవర్లలో ఛత్తీస్‌గఢ్ వారియర్స్ వికెట్ కూడా నష్టపోకుండా ఏకంగా 240 పరుగులు చేసింది. గుప్తిల్ 49 బంతుల్లో 16 సిక్సర్లు, 12 ఫోర్లతో మొత్తం 160 రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. మరో ఎండ్‌లో రిషి ధావన్ 42 బంతుల్లో 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.


గుప్తిల్, ధావన్ ధాటికి.. బిగ్ బాయ్స్ బౌలర్లు అంతా 10కిపైగా ఎకానమీతో పరుగులు ఇవ్వడం గమనార్హం. అనంతరం 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బిగ్ బాయ్స్.. 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 రన్స్‌కే పరిమితమైంది. రాబిన్ బిస్త్ (55) టాప్ స్కోరర్. సౌరభ్ తివారీ 37, గుణరత్నే 22 పరుగులు చేశారు.


ఇక గుప్తిల్ లీగ్‌లోనూ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 3 మ్యాచ్‌ల్లో 203 రన్స్‌తో ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే గుప్తిల్ తన అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ నుంచి బెస్ట్ ఓపెనర్లలో ఇతడు ముందువరుసలో ఉంటాడు. కివీస్ నుంచి వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా ఉన్నాడు. మొత్తం 198 వన్డేల్లో గుప్తిల్ 7346 రన్స్ చేశాడు. దీంట్లో 18 సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో 122 మ్యాచ్‌ల్లో 3531 పరుగులు చేశాడు. ఇక 47 టెస్టుల్లో 2586 రన్స్‌ చేశాడు.


ఇప్పటివరకు ఈ లీగ్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలిచిన ఛత్తీస్‌గఢ్ వారియర్స్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. మొత్తం 7 జట్లు ఉన్నాయి. మిగతావి ఢిల్లీ రాయల్స్, రాజస్థాన్ కింగ్స్, గుజరాత్ సాంప్ ఆర్మీ, దుబాయ్ గెయింట్స్, పంజాబీ షేర్, బిగ్ బాయ్స్ యూనికారీ. బిగ్ బాయ్స్ టీమ్ ఆడిన మూడింట్లోనూ ఓడి అట్టడుగున నిలిచింది.


ఈ లీగ్‌లో ఇంకా లెండిల్ సిమన్స్, కెవిన్ ఓబ్రియెన్, బ్రెండన్ టేలర్, దనుష్క గుణతిలక, శిఖర్ ధావన్, తిసరా పెరీరా, గురుకీరత్ సింగ్ మన్, రిచర్డ్ లెవీ, రాస్ టేలర్ వంటి పలువురు మాజీ స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ లీగ్ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 17న ఫైనల్ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com