ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. యువ బ్యాట్స్ మన్ శుభ్ మన్ గిల్ (112) అద్భుత సెంచరీ సాధించడం టీమిండియా ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది. విరాట్ కోహ్లీ (52), శ్రేయాస్ అయ్యర్ (78), కేఎల్ రాహుల్ (40) రాణించడంతో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 4, మార్క్ ఉడ్ 2, సకిబ్ మహమూద్ 1, గస్ ఆట్కిన్సన్ 1, జో రూట్ 1 వికెట్ తీశారు. అనంతరం 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది. అర్షదీప్ సింగ్ 2, హర్షిత్ రాణా 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 2, వాషింగ్టన్ సుందర్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీసి ఇంగ్లండ్ ను కుప్పకూల్చారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో టామ్ బాంటన్ 38, గస్ ఆట్కిన్సన్ 38, బెన్ డకెట్ 34, జో రూట్ 24, ఫిల్ సాల్ట్ 23, హ్యారీ బ్రూక్ 19 పరుగులు చేశారు. కెప్టెన్ జోస్ బట్లర్ 6, లియామ్ లివింగ్ స్టన్ 9 పరుగులకే అవుటయ్యారు. అంతకుముందు, టీమిండియా టీ20 సిరీస్ ను కూడా చేజిక్కించుకుంది. 5 మ్యాచ్ ల సిరీస్ ను 4-1తో గెలిచింది. ఈ పర్యటనలో ఇంగ్లండ్ కు కేవలం ఒకే ఒక్క విజయం లభించింది. టీ20 సిరీస్ లో మూడో మ్యాచ్ ను మాత్రమే ఇంగ్లండ్ నెగ్గింది. వన్డే సిరీస్ లో అన్ని మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది.
![]() |
![]() |