ఇటలీ రాజధాని రోమ్‌లో రోమ్ నుంచి జర్మనీకి వెళ్లాల్సిన రైనర్ ఎయిర్‌కు చెందిన విమానం రెండు రోజులు ఆలస్యం అయింది. సాధారణంగా విమానం ఆలస్యం కావడానికి.. విమానంలో సాంకేతిక సమస్యనో లేక వాతావరణం సహకరించకపోవడమో లేక ఎవరైనా బాంబు బెదిరింపులు చేయడమో లాంటి కారణాలు ఉంటాయి. ఇక్కడ మాత్రం ఆ విమానం ఆగిపోవడానికి ఒక పిల్లి కారణం అయింది. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో.. అందులో నుంచి పిల్లి అరుపులు వినిపించాయి. దీంతో ఎయిర్‌లైన్స్ సిబ్బంది.. ఆ విమానాన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి. దీంతో ఆ విమానం రెండు రోజుల పాటు రోమ్ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది.
విమానం గాల్లోకి ఎగిరే ముందు పిల్లి అరుపులు విన్న సిబ్బంది.. టేకాఫ్ నిలిపివేశారు. అనంతరం దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ పిల్లి ఎయిర్‌లైన్స్ సిబ్బందిని రెండు రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. విమానంలోని అత్యంత కీలకమైన ఎలక్ట్రిక్ బేలోకి ఆ పిల్లి దూరింది. అక్కడి నుంచి పిల్లి కదలకపోవడంతో చేసేదేమీ లేక దాన్ని బయటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం ఆ ఎలక్ట్రిక్ బేకు ఉండే కొన్ని ప్యానల్స్‌ను తొలగించారు. ఓవైపు సిబ్బంది పిల్లి గురించి వెతుకుతూ ఉంటే.. అది మాత్రం ఆ విమానంలో అటూ ఇటూ పరుగులు తీసింది. అయితే ఆ పిల్లి ఎక్కడైనా చిక్కుకుపోయి చనిపోతుందని భావించిన సిబ్బంది.. ఆ కారణంగా విమానంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని భయపడ్డారు. దీంతో ఆ విమానం రెండు రోజుల పాటు నిలిపివేశారు.
రెండు రోజుల తర్వాత ఆ పిల్లి.. మెల్లిగా విమానం నుంచి బయటికి వచ్చింది. విమానం డోర్ తెరిచి ఉంచగా.. మెట్ల మీద నుంచి కిందికి దిగి.. అక్కడి నుంచి రన్‌వే మీదుగా ఎయిర్‌పోర్టు నుంచి బయటికి పారిపోయింది. దీంతో ఎట్టకేలకు పిల్లి బాధ తప్పడంతో విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఆ పిల్లి కారణంగా రైనర్ ఎయిర్‌కు చెందిన ఆ విమానం రెండు రోజులు ఆలస్యంగా జర్మనీకి బయలుదేరింది. విమానం ఆలస్యం కావడంతో అందులో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
![]() |
![]() |