తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో రెండు రోజుల పసికందు మరణం ఆందోళనకు దారితీసింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయాడంటూ శిశువు తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమ బిడ్డ పుట్టినప్పుడు రెండున్నర కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడని.. అయితే బిడ్డ పుట్టాడనే ఆనందం రెండు రోజుల్లోనే ఆవిరైందని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. వైద్య సిబ్బంది ఇచ్చిన వ్యాక్సిన్ వికటించడం వల్లనే తమ బిడ్డ చనిపోయాడని ఆరోపించారు. ఆస్పత్రి సిబ్బంది రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఏదైనా అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది. చనిపోయిన బిడ్డను తల్లికి చూపించేందుకు తీసుకెళ్తుంటే.. ఆధార్ కార్డు అడిగారని, ఇంత కఠినంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు.
ఆస్పత్రి యాజమాన్యం స్పందన..
మరోవైపు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వలనే పసికందు మరణించాడనే ఆరోపణలను ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రమీలాదేవి ఖండించారు. తల్లి పాలు తాగిన వెంటనే శిశువును పడుకోబెట్టారని, దీంతో తాగిన పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఇన్స్‌ఫెక్షన్ అయ్యిందని ఆమె తెలిపారు. అలాగే రోగులు, బంధువులతో ఆస్పత్రి సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలను ఆమె ఖండించారు. అయితే రోగుల బంధువులతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న వీడియోను మీడియా ప్రతినిధులు చూపించగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్ సమాధానం దాటవేశారు.
మరోవైపు.. నవ మాసాలు మోసి, కన్న బిడ్డ.. రోజుల వ్యవధిలో తమను వదిలేసి వెళ్లిపోవటం ఆ తల్లిదండ్రులకు తీవ్ర దు:ఖాన్ని మిగిల్చింది. పండంటి మగబిడ్డ జన్మిస్తే ఎన్నో ఆశలు పెంచుకున్నామని.. కానీ ఈలోపే ఇలా అవుతుందని అనుకోలేదంటూ పసికందు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏ తల్లిదండ్రులకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ చనిపోవటానికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పసిపిల్లలకు పాలు పట్టిన వెంటనే పడుకోబెట్టకూడదని.. కాసేపు భుజం మీద వేసుకుని జో కొట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాలు వారి కడుపులోకి జేరతాయని.. పొలమారటం వంటి ఇబ్బందులు ఉండవంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa