చైనాలోని షెంజెన్ నగరంలో నివసించే ఓ మహిళ.. తాను మాల్దీవులు టూర్‌కు వెళ్తూ.. ప్రేమగా పెంచుకున్న పెంపుడు శునకం "యీ యీ" ను యానిమల్ కేర్ టేకింగ్ సెంటర్‌లో ఉంచింది. అయితే కేర్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఆ కుక్క.. హైవే పైకి పరిగెత్తింది. ఈ క్రమంలోనే రోడ్డుపై నుంచి వెళ్లే ఓ కారు ఢీకొట్టి చనిపోయింది. ఆ సమయంలో ఆ హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బంది.. ఆ చనిపోయిన కుక్కను చూశారు. దాన్ని తమ వాహనంలో తీసుకెళ్లి.. వారు ఉండే ప్రాంతానికి తరలించారు. అనంతరం ఆ చనిపోయిన కుక్కను వండుకుని మొత్తం 8 మంది తిన్నారు.
ఇక మాల్దీవులు నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన కుక్క తప్పిపోయిందని గుర్తించిన ఆ మహిళ.. తన శునకాన్ని తెచ్చి ఇచ్చిన వారికి 6800 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 5 లక్షలు ఇస్తానని తెలిపింది. "యీ యీ" తన కుటుంబ సభ్యులతో సమానంగా పెంచుకున్నానని.. దయచేసి దాన్ని వెతికిపెట్టమని కోరింది. అయితే ఆ కుక్క చనిపోయినపుడు.. దాన్ని హైవే పెట్రోలింగ్ సిబ్బంది తీసుకువెళ్లడం చూసిన వారు.. ఈ విషయాన్ని ఆ మహిళకు చెప్పారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ చెక్ చేయగా.. అందులో పెట్రోలింగ్ సిబ్బంది కుక్కను తీసుకొని వెళ్లడం కనిపించింది. అనంతరం పెట్రోలింగ్ అధికారులను విచారణ జరపగా.. రోడ్డు పక్కన పడి ఉన్న కుక్కను తీసుకెళ్లిన విషయం నిజమేనని అంగీకరించారు. అది వీధి కుక్క అని భావించామని.. అప్పటికే చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే పెట్రోలింగ్ అధికారులు తెలిపారు.
అయితే దాన్ని వండుకుని తిన్నట్లు చెప్పడంతో దాని యజమాని షాక్ అయ్యారు. తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న యీ యీ కుక్క ప్రమాదంలో చనిపోవడం.. దాన్ని వండుకుని తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ ఘటన కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఆ కుక్కను తీసుకెళ్లిన ఇద్దరు పెట్రోలింగ్ సిబ్బంది మాత్రం.. తాము అన్ని రకాల రూల్స్ పాటించినట్లు తెలిపారు. ప్రమాదంలో చనిపోయి రోడ్డుపై పడిపోయిన ఆ కుక్క ఫొటో తీసి.. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించారు. కుక్క చనిపోవడంతోనే.. వండుకొని తిన్నట్లు హైవే అధికారులు చెప్పారు. అయితే చైనాలో కుక్కలు, పిల్లులను వండుకొని తినే విషయంలో నిషేధం విధించిన మొట్టమొదటి నగరం షెంజన్ కావడం.. తాజా ఘటన కూడా అక్కడే జరగడం గమనార్హం.
![]() |
![]() |