ఏజెన్సీ ప్రాంతంలో రానున్న పదవ తరగతి రెగ్యులర్, ప్రైవేటు, సార్వత్రిక (ఓపెన్ స్కూల్) పరీక్షలు, ఇంటర్మీడియట్ రెగ్యులర్, సార్వత్రిక (ఓపెన్ స్కూల్) పరీక్షలలో విద్యార్థులందరూ కష్టపడి చదివి పాసవ్వాలని, ఇతర మార్గాలు అన్వేషించవద్దని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ పరీక్షార్థులకు హితబోధ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆయా పరీక్షలు అత్యంత పకడ్బందీగా, ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని ఆదేశించారు.పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో సి.సి. కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల ఫరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలని, ఇంటర్నెట్ కేంద్రాలు, జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలోనికి అభ్యర్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది ఎవ్వరూ ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకు వెళ్లరాదని, ముందుగానే పోలీసులు తనిఖీ చేసి, ఎలక్ట్రానిక్ పరికరాలైన బ్లూటూత్, స్మార్ట్‌ఫోన్, తదితర వస్తువులు డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితులలోను మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా చూడాలని, పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల భవనాలపై కూడా నిఘా పెట్టాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరాలని, సమయం మించిన పిదప అనుమతించరాదని పేర్కొన్నారు. అవసరమైన ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించాలన్నారు.
![]() |
![]() |