ఇండియాని పట్టిపీడిస్తున్న సమస్యల్లో నకిలీ నోట్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఫేక్ కరెన్సీ మోసాలు తగ్గడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూర్చే ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయి. నకిలీ నోటును ముద్రించడం, చెలామణి చేయడం లేదా ఉపయోగించడానికి ప్రయత్నించినా సరే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇంతకీ నకిలీ నోట్లతో పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పొరపాటును మీ దగ్గరకు నోట్లు వస్తే ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.తాజాగా నాలుగు సంవత్సరాల నాటి కేసులో నకిలీ రూ.2000 నోట్లు ఉపయోగించిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరిపై ఐపీసీ సెక్షన్ 489బీ (నకిలీ కరెన్సీ వినియోగం), సెక్షన్ 489సీ (నకిలీ నోట్లను కలిగి ఉండటం) కింద అభియోగాలు మోపింది. వారి నుంచి 29 నకిలీ రూ.2000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు.నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకోవడానికి భారతదేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతి (IPC)లో ఈ నేరానికి సంబంధించిన సెక్షన్లు ఇవే..
సెక్షన్ 489E: నిజమైన కరెన్సీ నోట్లలా కనిపించే ప్రకటనలు లేదా పత్రాలను ముద్రించడం కూడా నేరమే. ఇందుకు ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి.
సెక్షన్ 489D: ఒక వ్యక్తి నకిలీ డబ్బు సంపాదించడానికి ప్రింటింగ్ ప్లేట్లు లేదా ఇతర పరికరాలతో దొరికితే, వారికి జీవిత ఖైదు లేదా జరిమానాతో పాటు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
సెక్షన్ 489C: ఎవరైనా నకిలీ కరెన్సీని కలిగి ఉన్నారని తేలితే, అది నకిలీ అని వారికి తెలిసినట్లు తేలితే, వారికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుంది.
సెక్షన్ 489B: ఒక వ్యక్తి తెలిసి తెలిసి నకిలీ నోటును ఉపయోగించడానికి లేదా చలామణి చేయడానికి ప్రయత్నిస్తే, వారికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
సెక్షన్ 489A: ఎవరైనా నకిలీ కరెన్సీని తయారు చేస్తూ పట్టుబడితే, వారికి జీవిత ఖైదు లేదా జరిమానాతో పాటు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
నకిలీ కరెన్సీ ఉగ్రవాదం లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ముడిపడి ఉంటే, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA), మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) వంటి కఠినమైన చట్టాలు వర్తిస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) RBI చట్టం, 1934 ప్రకారం ఇటువంటి కేసులను దర్యాప్తు చేయవచ్చు.మీరు అనుకోకుండా నకిలీ నోటును స్వీకరిస్తే ఆలస్యం చేయకుండా సమీపంలోని బ్యాంకు లేదా పోలీస్ స్టేషన్‌కు తెలియజేయండి. దీన్ని ఉపయోగించవద్దు లేదా సర్క్యులేట్ చేయవద్దు. ఎందుకంటే నకిలీ నోటును మరొకరికి ఇవ్వడం నేరం. మీ వద్ద ఉన్న నోటును బ్యాంకు జప్తు చేస్తుంది. తదుపరి చర్యల కోసం పోలీసులకు, RBIకి తెలియజేస్తుంది.
![]() |
![]() |