ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఒక బీసీ ప్రధానమంత్రి గొప్పగా రాణిస్తుంటే అగ్రవర్ణాల్లోని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అత్యున్నత ప్రధాన మంత్రి పదవిని బీసీ చేపడితే ఓర్వలేకపోతున్నారన్నారు.ఈరోజు విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ సంఘాల ప్రతినిధులతో కృష్ణయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ కుల గణన తప్పులతడకగా సాగిందని, ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే నరేంద్ర మోదీ కులాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రధాన మంత్రిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. బీసీ సమస్యలను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి కొత్త ఎత్తుగడ వేశారన్నారు.మోదీ బీసీ కాదనడానికి ఆధారాలు లేకపోయినప్పటికీ ఆ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశంలోని బీసీలను అవమానించడమే అన్నారు. ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో బీసీలకు రక్షణ కల్పించడానికి మోదీ చర్యలు చేపట్టారని ఆయన అన్నారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించారని, విస్తృత అధికారాలు ఇచ్చారని అన్నారు.బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఇదివరకు సర్వేలో ప్రభుత్వం ఎన్నో ప్రశ్నలు అడిగిందని, అవన్నీ కాకుండా 3 ప్రశ్నలతో ఇంటింటికి సర్వే చేయాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకుంటే ఊరుకునేది లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
![]() |
![]() |