తమిళనాడులో జాతీయ విద్యావిధానం అమలును తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న డీఎంకే ప్రభుత్వం.. వార్షిక బడ్జెట్ ప్రతుల్లో ‘రూపే’ చిహ్నాన్ని తొలగించిన విషయం తెలిసిందే. దాని స్థానంలో ‘రూ’ (రూబాయ్) అనే తమిళ అక్షరాన్ని చేర్చింది. దీంతో హిందీ భాష విషయంలో మోదీ సర్కారు, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. అయితే, ఈ సింబల్‌ను తమిళనాడు మాజీ ఎమ్మెల్యే, డీఎంకే నాయకుడు ధర్మలింగం కుమారుడు ఉదయ్ కుమార్ రూపొందించడం గమనార్హం. ఈ క్రమంలో వివాదంపై ఉదయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఐఐటీ గువహటిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోన్న ఉదయ్ కుమార్.. వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు. తన తండ్రి డీఎంకే నాయకుడు కావడానికీ, రూపాయి సింబల్ రూపకల్పనకూ ఎటువంటి సంబంధం లేదని తెల్చిచెప్పారు. అది కేవలం కాకతాళీయమని ఉదయ్ స్పష్టం చేశారు. ‘‘రూపాయి సింబల్ మార్చి, దాని స్థానంలో మరో లోగోను ఏర్పాటు చేసుకోవాలని తమిళనాడు సర్కారు హఠాత్తుగా నిర్ణయం తీసుకుంది.. అది పూర్తిగా ప్రభుత్వ ఇష్టం.. దీనిపై నేను స్పందించడానికి ఏమీ లేదు.’’ అని ఉదయకుమార్ తెలిపారు. రూపాయి చిహ్నం సృష్టికర్తగా తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఒక డిజైనర్‌గా తన పనిలో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, ఆ నిర్ణయం తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఉదయ్ వ్యాఖ్యానించారు.
‘మనం రూపొందించే అన్ని డిజైన్లకు ప్రశంసలు రావు.. విజయవంతం కావు... విమర్శలు కూడా ఎదురవుతాయి.. ఒక డిజైనర్‌గా వాటిని ఎల్లప్పుడూ సానుకూలంగా తీసుకుంటాం.. విమర్శలు నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు... నేను దీనిని (చర్య) నా పనికి అగౌరవంగా లేదా నిర్లక్ష్యంగా చూడను.. సింబల్ రూపకల్పన సమయంలో నా పని గురించే నేను ఆందోళన చెందాను.. పోటీని తట్టుకుని, లక్ష్యాన్ని చేరుకోడానికి ప్రయత్నించాను.. అందరికీ ఆమోదయోగ్యమైన, సరళమైన, ప్రభావం చూపే, అర్థవంతమైన లోగోను సృష్టించాలని కోరుకున్నాను.. ఈ రోజు ఏదైనా (వివాదం) జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’ అని పేర్కొన్నారు. అయితే, వృద్ధుడైన తన తండ్రి ప్రస్తుతం గ్రామంలో హాయిగా జీవిస్తున్నారని ఉదయ్ చెప్పారు. ఇక,1971 నుంచి డీఎంకేలోనే ఉన్న ధర్మలింగం.. గతంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
![]() |
![]() |