దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు అంతా చూస్తుండగానే.. ఓ బిజీ మార్కెట్‌లో చోరీ జరిగింది. ముఖ్యంగా బ్యాంకు నుంచి 80 లక్షలు డ్రా చేసిన ఓ వ్యక్తి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆ విషయాన్ని గమనించిన దొంగ తుపాకీతో అక్కడకు చేరుకున్నాడు. ముఖానికి ముసుగు వేసుకుని మరీ తుపాకీతో నేలపై కాల్పుపు జరుపుతూ.. సదరు వ్యాపారిని భయపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరించగా.. భయపడిపోయిన అతడు డబ్బులున్న బ్యాగును దొంగ చేతుల్లో పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి తన పనుల నిమిత్తం బ్యాంకు నుంచి 80 లక్షల రూపాయలు తీసుకుని వస్తున్నాడు. అయితే వాటిని తన బ్యాగులో పెట్టుకుని భుజాన వేసుకుని వస్తుండగా.. అప్పటికే ఈ విషయాన్ని గుర్తించాడో దొంగ. అయితే ఇదేమీ తెలియని వ్యాపారి నడుచుకుంటూనే వస్తుండగా.. దొంగ కూడా అతడిని అనుసరించాడు. చాందిని చౌక్‌లోని ఓ ఇరుకు రోడ్డుకు రాగానే.. తన తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ముఖానికి ముసుగు వేసుకుని ఉన్న అతడు.. నేలపై కాల్పులు జరుపుతూ వ్యాపారిని వణికించాడు.
ప్రాణ భయంతో వ్యాపారి తన చేతిలో ఉన్న బ్యాగును దొంగకు అప్పగించగా.. కాల్పులు జరుపుతూనే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆపై బ్యాగును ఓ చోట పడేసి.. అందులోని డబ్బులు తీసుకుని ఉడాయించాడు. దీంతో సదరు ప్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. జరిగిందంతా చెప్పి కేసు పెట్టాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా చోరీ జరిగిన ప్రాంతానికి వచ్చి.. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అయితే అందులో దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అన్నీ రికార్డు అయ్యాయి.
ఒకే ఒక్క నిమిషంలో ఈ దొంగతనం జరగ్గా... అక్కడున్న ప్రజలంతా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండిపోయారు. ఏ ఒక్కరు కూడా దీన్ని ఆపేందుకు ముందుకు రాలేరు. అయితే దొంగతనం చేసింది ఒక్కరే అయినా.. అతడికి మరో ఐదుగురు సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా దొంగ బ్యాగు తీసుకుని బయటకు వెళ్లిన తర్వాత ఆరుగురు వ్యక్తులు మూడు ద్విచక్రవాహనాలపై పారిపోయారని తెలిపారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు.
ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. పట్ట పగలే దొంగలు ఇలా రెచ్చిపోయారంటే.. రాత్రుళ్లు పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈక్రమంలోనే పోలీసులు కేసును చాలా సీరియస్‌గా తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
![]() |
![]() |