హైదరాబాద్‌లో చోరీ జరిగింది.. గంటల వ్యవధిలోనే విశాఖపట్నంలో నిందితురాలు దొరికిపోయింది. మొబైల్ సాయంతో యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నానికి చెందిన సత్యనారాయణకు శ్రీదేవి అనే యువతికి పరిచయమైంది. తాను పని కోసం వెతుకుంటున్నానని చెప్పడంతో సత్యనారాయణ నిజమే అనుకున్నారు. హైదరాబాద్ బోరబండ శ్రీరామ్‌నగర్‌లో ఉంటున్న కుమార్తె హాసిని, అల్లుడు మున్నాల ఇంట్లో పనిచేసేందుకు కుదిర్చారు. భార్యాభర్తలిద్దరూ ఈవెంట్ మేనేజర్లు.. ఈ క్రమంలో శనివారం (మార్చి 15న) రాత్రి విశాఖపట్నం నుంచి బస్‌లో హైదరాబాద్ పంపారు సత్యనారాయణ.
ఆదివారం ఉదయం హైదరాబాద్ బొరబండ శ్రీరామ్‌నగర్‌లోని మున్నా, హాసినిల ఇంటికి శ్రీదేవి వచ్చింది. ఆమె ఆదివారం రాత్రి వరకు ఆ ఇంట్లో కలుపుగోలుగా మాట్లాడుతూ నటించింది. ఆదివారం రాత్రి హాసిని, మున్నాలు ఒక గదిలో ఉన్నారు.. అయితే 10.30 గంటల సమయంలో శ్రీదేవి చోరీ ప్లాన్ అమలు చేసింది. ఇంట్లో ఉన్న 16 గ్రాముల బంగారం, పావుకిలో వెండి తీసుకొని అక్కడి నుంచి పారిపోయింది. కొద్దిసేపటి తర్వాత యజమాని హాసిని పిలిచినా శ్రీదేవి పలకలేదు.. దీంతో ఆమెకు ఫోన్ చేయగా, స్పందించలేదు. అప్పుడు హాసినికి అనుమానం వచ్చింది.. వెంటనే వెళ్లి ఇంట్లో వెతకగా బంగారం, వెండి చోరీకి గురైనట్లు గుర్తించారు.
వెంటనే హాసిని పోలీసులకు చోరీ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఇంతలో హాసిని తన తండ్రి సత్యనారాయణకు కూడా సమాచారం ఇఛ్చారు. శ్రీదేవి విశాఖపట్నం నుంచి వచ్చే సమయంలో మొబైల్‌ను మరమ్మతుకు ఇచ్చినట్లు చెప్పడంతో.. వెంటనే సత్యనారాయణకు ఆ విషయం గుర్తుకు వచ్చి ఆ మొబైల్ షాపు దగ్గరకు విశాఖపట్నం పోలీసులతో వెళ్లారు. ఈలోపు నిందితురాలు అక్కడికి రావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం పోలీసులు వెంటనే హైదరాబాద్ బోరబండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితురాలిని తీసుకొచ్చేందుకు బోరబండ పోలీసులు విశాఖపట్నం వెళ్లారు. యువతి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావడం.. వచ్చిన కొన్ని గంటల్లోనే చోరీ చేసి పారిపోవడం.. ఆ వెంటనే విశాఖపట్నం పోలీసులకు దొరికిపోవడం అంతా ఒక్కరోజు గ్యాప్‌లోనే జరిగిపోయింది.
![]() |
![]() |