అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడీ హత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆరు దశాబ్దాల కిందట జరిగిన ఈ హత్యకు సంబంధించిన కీలక దస్త్రాలను తాజాగా బయటపెట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆ పత్రాలను పెట్టారు. మాజీ అధ్యక్షుడి మరణానికి సంబంధించి దాదాపు 80 వేల డాక్యుమెంట్లను విడుదల చేయనున్నట్లు ట్రంప్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, కెన్నడీ హత్యకు సంబంధించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) దాదాపు 2400 కొత్త రికార్డులను ఇటీవల గుర్తించింది.
రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. కెన్నడీ హత్యకు సంబంధఇంచి విడుదల చేసిన డాక్యుమెంట్ల 1000కిపైగా ఫైళ్లు ఉన్నాయి. కెన్నడీ మరణం చుట్టూ ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకోడానికి పరిశోధకులు, చరిత్రకారులు, నిపుణులు దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నంలో ఈ పత్రాలు ఓ భాగం. 1963 నవంబరు 22న అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నడీపై టెక్సాస్ పర్యటనలో దాడి జరిగింది. దుండగుల కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు.. 43 ఏళ్లకే అధ్యక్షు పదవి చేపట్టిన ఆయన.. ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా నిలిచారు.
కెన్నడీ హత్య కేసులో లీ హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా.. దర్యాప్తు సమయంలో అతడు అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. హార్వే హంతుకుడ్ని పట్టుకుని జైల్లో వేయగా.. కొంతకాలం తర్వాత అతడు క్యాన్సర్‌తో చనిపోయాడు. అప్పటి నుంచి కెన్నడీ హత్య మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా విడుదల చేసిన డాక్యుమెంట్లలో సంచలన విషయాలు వెల్లడి కానప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. నిఘా కార్యకలాపాలు ముఖ్యంగా ఈ హత్య అమెరికా-సోవియట్ సంబంధాలను ఎలా ప్రభావితం చేసిందో వివరిస్తాయని పేర్కొంటున్నారు.
అలాగే, కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు ఓస్వాల్డ్.. హత్యకు ముందు మెక్సికో నగరంలోని సోవియట్, క్యూబా ఎంబసీల్లో పలువురి కలిసినట్టు తాజా పత్రాలు బయటపెట్టాయి. క్యూబా, సోవియట్ యూనియన్ వీసా కోసం ప్రయత్నించినట్టు చెబుతున్నాయి. అంతేకాదు, మెక్సికోలోని రష్యా దౌత్య కార్యాలయంలో 1963 సెప్టెంబరులో కేజీబీ అధికారితో మాట్లాడినట్టు తెలియజేవాయి.
ఇదిలా ఉండగా, పత్రాలను విడుదల చేసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గరిష్ఠ పారదర్శకతతో కూడిన నవ శకానికి నాంది పలికారని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యానించారు. ఎలాంటి సవరణలు లేకుండానే కెన్నడీ హత్య రహస్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని ఆమె వెల్లడించారు.
![]() |
![]() |