అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సహకారంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భూమికి తీసుకొచ్చింది. మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ వ్యోమనౌక డ్రాగన్ కాప్సూల్.. ఐఎస్ఎస్ నుంచి క్షేమంగా ఫ్లోరిడా తీరంలో దింపింది. ఈ క్రమంలో ‘మరోసారి వ్యోమగాములు సురక్షితంగా చేరుకున్నారు’ నాసా, స్పేస్ఎక్స్ బృందానికి ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు చెప్పారు. దీంతోపాటు ఈ మిషన్‌కు ప్రాధాన్యత ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అయితే, తాను ఇచ్చిన ఆఫర్‌ను గత అధ్యక్షుడు జో బైడెన్ తిరస్కరించారని ఆరోపించారు.
‘‘మరోసారి వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చిన నాసా, స్పేస్ఎక్స్ బృందానికి అబినందనలు.. ఈ మిషన్‌కు ప్రాధాన్యత ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ధన్యవాదాలు.. ’’ అని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. గతంలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ.. అంతరిక్షంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు తాను ముందుకొస్తే మాజీ అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం రాజకీయ కారణాలతో తిరస్కరించిందని ఆరోపణలు చేశారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు సహకరించాలని ఎలాన్ మస్క్‌ను రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ కోరారు.
అనంతరం దీనిపై ప్రపంచ కుబేరుడు స్పందిస్తూ.. ‘ఐఎస్ఎస్‌లో నెలలుగా ఇద్దరు వ్యోమగాములు చిక్కుకుపోయినా నాటి బైడెన్ యంత్రాంగం పట్టించుకోలేదు.. ఇది చాలా దారుణం.. నాసా క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకొచ్చేందుకు కొద్ది నెలల కిందటే స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది’ అని తెలిపారు.
గతేడాది జూన్ 5న ఎనిమిది రోజుల పరిశోధనల కోసం బోయింగ్ స్టార్‌లైనర్‌లో ఐఎస్ఎస్‌కు వెళ్లారు. అయితే, అనూహ్యంగా స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతికలోపం తలెత్తడంతో అక్కడ చిక్కుకున్నారు. ఎక్కువ కాలం భారరహిత స్థితిలో ఉంటే వ్యోమగాములు కండరాల క్షీణత బారిన పడే అవకాశం ఉందని.. ఎముకల పటిష్టత కూడా తగ్గుతుందని.. పోషకాలలేమి సమస్యలు వస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారిని వీలైనంత వేగంగా తీసుకురావాలని కోరారు.
![]() |
![]() |