ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు నిర్వాకం వల్లే గ్రహణం పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై ఉన్న శ్రద్దలో ఆవగింజంతైనా రాయలసీమ సాగునీటి ప్రాజెక్ట్‌లపై లేదని ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ..... విభజన చట్టం కింద ఏపీకి హక్కుగా రావాల్సి ఉన్న 101 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు వైయస్ జగన్ గారు ముందుచూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్‌తో సీమ రైతుల సాగునీటి కష్టాలు తీరిపోతాయని సంతోషిస్తున్న తరుణంలో చంద్రబాబు ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్ట్‌కు మోకాలడ్డుతూ వచ్చాడు.
తెలంగాణ టీడీపీ నాయకులతో ఎన్టీటీలో ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా కేసులు వేయించారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అడ్డుకునేందుకు శాయశక్తులా పనిచేశారు. శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను వైయస్ జగన్ రాయలసీమకు తీసుకువెడుతున్నారంటూ రేవంత్‌రెడ్డి గతంలో అనేకసార్లు ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని 798 అడుగుల ఎత్తు నుంచే తోడేసి డ్యాంను పూర్తిగా ఖాళీ చేస్తుంటే సీఎంగా ఉండి చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. రాయలసీమ మీద చంద్రబాబు చూపుతున్న సవతితల్లి ప్రేమకు ఇదే నిదర్శనం. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీటిని తెచ్చుకునే హక్కును పోగొట్టుకునేలా గతంలోనూ ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే నిమ్మకునీరెత్తినట్లు చంద్రబాబు వ్యవహరించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపైనా నోరు మెదపలేదు. ఎన్జీటీని ఆదేశాలను బేఖాతర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంటే చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు అని విమర్శించారు.
![]() |
![]() |