అశోక్ లేల్యాండ్ ప్రారంభంతో ఏపీలో పారిశ్రామిక నవశకం ప్రారంభమైందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సంస్థ ప్రారంభం కావటం రాష్ట్ర పారిశ్రామికరంగ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తుందని చెప్పారు. విజయవాడ మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ బస్ బాడీ ప్లాంట్‌ను బుధవారం లోకేశ్ ప్రారంభించారు. అంతకుముందు ఆ కంపెనీ తయారు చేసిన డబుల్ డెక్కర్ బస్సులో ప్లాంటును సందర్శించారు. ఆవరణలో మొక్క నాటారు. రిబ్బన్ కట్ చేసి ప్లాంటును ప్రారంభించారు. తర్వాత అశోక్ లేల్యాండ్ తయారు చేసిన ఎంఎ్‌సఆర్టీసీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో లోకేశ్ మాట్లాడారు. ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో మల్లవల్లిలో 1,360 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇండస్ర్టియల్ పార్క్‌ను వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసింది. టీడీపీ ప్రభుత్వం 450కు పైగా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే వైసీపీ వేధింపుల కారణంగా చాలావరకు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఆ పాలనలో నష్టపోయిన పారిశ్రామిక సంస్థల్లో అశోక్ లేల్యాండ్ కూడా ఒక టి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోనే అత్యధిక పన్ను చెల్లింపుదారులలో ఒకరైన అమరరాజా, లులు వంటి భారీ పెట్టుబడిదారీ సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయి. జాకీ వంటి కంపెనీలు కూడా పొరుగు రాష్ర్టాలకు వెళ్లిపోయాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో మళ్లీ ఏపీకి ‘బ్రాండ్’ వచ్చింది. అశోక్ లేల్యాండ్ అత్యాధునిక బస్సు తయారీ కర్మాగారం ప్రారంభోత్సవానికి రావటం గొప్పగా భావిస్తున్నా. పాదయాత్ర సందర్భంగా మల్లవల్లికి వచ్చినపుడు అశోక్ లేల్యాండ్‌ను తిరిగి తీసుకువస్తానని హామీ ఇచ్చాను. ఆ ఎన్నికల హామీ నెరవేరినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పారు.
![]() |
![]() |