టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యాప్ యజమానులే లక్ష్యంగా పోలీసుల చర్యలు చేపట్టారు. తాజాగా..19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెలబ్రిటీలను సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. యాప్ నిర్వాహకులే టార్గెట్‌గా కొత్త సెక్షన్లు కూడా జత చేయనున్నట్లు సమాచారం. యాప్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రెటీల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్న పోలీసులు.. ఛార్జ్ షీట్‌లో వారిని సాక్షులుగా చేర్చనున్నారు. ఈ మేరకు న్యాయస్థానంలో మియాపూర్ పోలీసులు మెమో దాఖలు చేశారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 11 మంది యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు తొలుత కేసులు నమోదు చేశారు. హర్షసాయి, విష్ణుప్రియ, బండారు శేషయాని సుప్రీత, ఇమ్రాన్‌ఖాన్, రీతూ చౌదరి, యాంకర్ శ్యామల, అజయ్, సన్నీయాదవ్ సహా పలువురు సెలబ్రిటీలు, టీవీ నటులపై కేసులు బుక్ చేశారు. వీరిలో పలువురు పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మరో 25 మంది టాలీవుడ్ సెలబ్రెటీలపై కేసులు నమోదయ్యాయి. ఇమ్మాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు.
ఇక ఈ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఆమె ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయస్థానం శ్యామలను అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచారణకు సహకరించాల్సిందిగా శ్యామలకు సూచించింది. ఈ నేపథ్యంలో శ్యామల నేడు ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు.
కాగా, టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకచ్చారు. సెలబ్రెటీల మాటలు నమ్మి చాలా మంది యువత, అమయాకులు బెట్టింగులు పెట్టి డబ్బులు పొగొట్టుకుంటున్నారని.. మరికొందరు ప్రాణాలు కూడా తీసుకున్నారని ఆయన కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా యుద్ధమే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు సెలబ్రెటీలపై కేసులు బుక్ చేస్తున్నారు.
![]() |
![]() |