కాశీనాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఎంపీ మేడా రఘునాథరెడ్డి అన్నారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కాశీనాయన క్షేత్రం ప్రాంతాన్ని అటవీ శాఖ నుంచి డీనోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. క్షేత్రం కార్యకలాపాల కోసం 33 ఎకరాల భూమిని కేటాయించాలన్నారు. కాశీనాయన క్షేత్రం దాదాపు 100 అన్నదాన సత్రాలను నిర్వహిస్తోందని.. ఆధ్యాత్మిక గురువు కసిరెడ్డి నాయన బోధనలు ఎందరికో ఆదర్శమని మేడా రఘునాథరెడ్డి అన్నారు.కాగా, తెలుగు రాష్ట్రాల్లో అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రం.. ఆధ్యాత్మికవేత్తలకు దివ్యానుభూతిని కలిగిస్తోంది.
ఏ సమయంలో వెళ్లినా అన్నదానం జరుగుతుండడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే అనాథలకు ఇది ఆకలి తీర్చే ఒక దేవాలయం. వైయస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గం, కాశినాయన మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ధార్మిక సేవలు కొనసాగుతున్నాయి. అయితే అటవీ ప్రాంతం పేరుతో ఈ ఆశ్రమాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఇప్పటికే సత్రాలు, వాష్ రూమ్‌లను కూల్చివేశారు. గతంలో అటవీ శాఖ అధికారులు అక్కడి నిర్మాణాలపై అభ్యంతరాలు తెలిపినా కూల్చివేత వరకూ వెళ్లలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 13 హెక్టార్ల భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు లేఖ కూడా రాశారు. అటవీ సంరక్షణ చట్టం రాకముందు నుంచే ఇక్కడ దేవాలయాలు ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సైతం పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి ఇదే సమస్యను తీసుకెళ్లారు.
![]() |
![]() |