బ్రిటన్ భారతీయులకు మరింత ఖరీదైనదిగా మారబోతుంది. ముఖ్యంగా అక్కడికి వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు, పర్యటకులు, బిజినెస్ చేయాలనుకునే వాళ్లకు వీసా ఫీజులను మరింతగా పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అయితే ఈ పెరిగిన ధరలను ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు రాబోతున్నట్లు కూడా వివరించింది. మరి ధరల పెంపుతో ఏ వీసాకు ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాలి, గతంతో పోలిస్తే ఎంత ఎక్కువ కట్టాల్సి ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వీసా తప్పనిసరి కావడంతో భారతీయులపైనే అధిక భారం..
పర్యటకులతో పాటు ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వచ్చే విద్యార్థులు సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా భారతీయులు యూకేలో అడుగు పెట్టాలంటే వీసా తప్పనిసరి కాగా.. ధరల పెంపుతో మరింత భారం పడబోతుంది. ముఖ్యంగా ఆరు నెలల గడువు గల వీసాకు గతంలో 115 పౌండ్ల ఫీజు ఉండగా.. దాన్ని 10 శాతం పెంచారు. అంటే ఇప్పుడు ఈ వీసా ఫీజు 127 పౌండ్లకు చేరుకుంది.
వీసా అవసరం లేని జాతీయులకు సైతం ఈటీఏ రుసుము పెంపు
కేవలం ఆరు నెలల గడువు వీసా ఫీజు మాత్రమే కాకుండా 2 సంవత్సరాల కాల పరిమితి వీసా రుసుమును కూడా పెంచారు. రెండు, ఐదు మరియు పదేళ్ల దీర్ఘకాలిక సందర్శన వీసాల రుసుములు వరుసగా.. 475 పౌండ్లు, 848 పౌండ్లు, 1059 పౌండ్లకు చేరుతాయి. డైరెక్ట్ ఎయిర్ సైడ్ ట్రాన్సిట్ వీసా రుసుము 39 పౌండ్లకు పెరిగింది. అలాగే ల్యాండ్ సైడ్ ట్రాన్సిట్ వీసా ధర 70 పౌండ్లకు చేరుకుంది. అలాగే యూకే సందర్శించడానికి వీసా అవసరం లేని జాతీయులకు అవసరమైన ఈటీఏ రుసము 60 శాతం పెరిగి 16 పౌండ్లకు చేరుకుంది.
అలాగే ప్రధాన దరఖాస్తుదారు సహా వారి డిపెండెంట్లు ప్రస్తుతం 490 పౌండ్లు చెల్లించాల్సి ఉండగా.. దాన్ని 524 పౌండ్లకు పెంచారు. అలాగే చైల్డ్ స్టూడెంట్‌లకు ఇదే పెంపును వర్తింపజేస్తున్నట్లు ప్రకటనలో వివరించారు. అలాగే ఏదైనా కోర్సు నేర్చుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు 6 నెలల నుంచి 11 నెలల స్వల్ప కాల పరిమితి ఫీజును కూడా 9 శాతం పెంచారు. గతంలో ఈ వీసా కోసం 200 పౌండ్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు 214 పౌండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటిని ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమలు చేయబోతున్నారు
![]() |
![]() |