పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారుకు వరుస చిక్కులు ఎదురవుతున్నాయి. మొన్నటి వరకు ఆందోళనలు చేస్తున్న రైతులతో వ్యవహరించిన తీరుతో భగవంత్ మాన్ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు, దేశంలోని ఇతర పార్టీలు, పౌరులు.. ఆప్ సర్కారు తీరును ఆక్షేపించాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీ సొంత ఎమ్మెల్యేలే చేరడం భగవంత్ మాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
సొంత సర్కారు తీరుపైనే ఆప్ ఎమ్మెల్యేలు రచ్చకెక్కారు. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఆప్ శాసన సభ్యులు ప్రభుత్వ పని తీరుపై అసంతృప్తి గళం వినిపించారు. ఆరోగ్య రంగంలో సర్కారు పని తీరు ఘోరంగా ఉందని విమర్శలు గుప్పించారు. తనతో పాటు తన నియోజక వర్గంలోని ప్రజలు పాకిస్థాన్‌లో నివసిస్తున్నట్లుగా భావిస్తున్నామని మోగా జిల్లాలోని ధరమ్‌కోట్ నియోజక వర్గ ఎమ్మెల్యే దేవిందర్‌జీత్ సింగ్ వ్యాఖ్యానించారు.
ధరమ్‌కోట్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధునికీకరణకు సంబంధించి ఏదైనా ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందా అని దేవిందర్‌జీత్ సింగ్ అసెంబ్లీ ప్రశ్న అడిగారు. దానికి ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని సమాధానం ఇచ్చారు. ధరమ్‌కోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సబ్ డివిజనల్ ఆస్పత్రిగా మార్చే ప్రతిపాదనేదీ ప్రస్తుతం ప్రభుత్వ వద్ద లేదని చెప్పుకొచ్చారు. కోట్ ఇసే ఖాన్‌లోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి కేవలం 8 కిలో మీటర్ల దూరంలోనే ధరమ్‌కోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్నందు వల్ల ఆధునికీకరించడం లేదని వివరించే ప్రయత్నం చేశారు.
అలాగే ధరమ్‌కోట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ట్రామా కేర్ సెంటర్‌ను ప్రారంభించాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద లేదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే జలంధర్, పఠాన్ కోట్, ఖన్నా, ఫిరోజ్‌పూర్, ఫజిల్కాల్లో ట్రామా కేర్ సెంటర్‌లు ఉన్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన దేవిందర్‌జీత్ సింగ్ మోగా జిల్లాపైనా, తన నియోజక వర్గంపైనా ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. షుట్రానా నియోజక వర్గ ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ బాజీగర్ కూడా ఆరోగ్య రంగంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
![]() |
![]() |