దొంగలు రూట్ మారుస్తున్నారు. ఎప్పటిలాగా మూసధోరణిలో వెళ్లడం లేదు. బంగారం, వెండి, మోటార్ బైక్స్ వంటివి దొంగతనం చేయడం లేదు. ప్రస్తుతం టెక్నాలజీ పెరగడం, సీసీకెమెరాలు ఎక్కువగా ఉండటంతో దొంగలను పట్టుకోవడం సులువుగా మారింది. దీంతో వాళ్లు రూట్ మార్చేసి.. వెరైటీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పొలాలను నమ్ముకొని ఉన్న రైతుల కష్టాలకు ఫలితం లేకుండా చేస్తున్నారు. టమాటా, ఉల్లి, పత్తి, మిర్చి ఎత్తుకెళ్లడం ఇప్పటి వరకు చూశాం.. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో ఓ వెరైటీ దొంగతనం జరిగింది.
ఈ దొంగతనం కారణంగా గ్రామంలో ఉన్న రైతుల మధ్య భయాందోళనలు పెరిగాయి. గ్రామంలోని భీముడి లింగారెడ్డి అనే రైతు తన రెండు ఎకరాల పొలంలో జామాయిల్ చెట్లను నాటారు. ఓ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అతడు అక్కడే కాపలా ఉండి.. సాయంత్రం ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం లింగారెడ్డి పొలానికి వెళ్లి చూడగా షాక్ అయ్యాడు. అక్కడ ఉన్న జామాయిల్ చెట్లు ఒక్కటి కూడా కనిపించలేదు. దాదాపు 130 చెట్ల వరకు అక్కడ నరికి ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే ఆలస్యం చేయకుండా.. అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానిక రైతుల మధ్య ఆందోళనలు నెలకొన్నాయి. రైతులు తమ పొలాల్లో నాటిన పంటలకు రక్షణ ఉంటే తప్ప దొంగతనాలను నివారించలేమని అభిప్రాయపడుతున్నారు. ఇలా సాగు పంటలకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని.. రైతులకు మద్దతుగా ప్రభుత్వం మరింత చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇటీవల కాలంలో అశ్వాపురం మండలంలో రైతులు వ్యవసాయం చేస్తూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే.. అటవీ భద్రత లేకపోవడం, పంటలకు రక్షణ లేకపోవడం వంటి సమస్యలు రైతుల్ని తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇంట్లో, పొలం వద్ద రక్షణ కరువు..
జామాయిల్ చెట్లు సరిగ్గా విక్రయానికి వచ్చిన సమయంలో ఇలా జరగడంతో అతడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. ఇంట్లో రక్షణ లేక.. పొలం దగ్గర కూడా రక్షణ లేకపోతే.. తాము ఎలా బతకాలంటూ రోదించాడు. ఈ ఘటన ద్వారా ప్రభుత్వం, పోలీస్ శాఖ మరింత రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. వారు.. తమ పొలాల్లో నాటిన పంటల కొరకు సాంకేతిక పరంగా రక్షణ పెంచాలని.. దొంగతనాలు ఈ ప్రాంతంలో జరగకుండా కృషి చేయాలని కోరుతున్నారు.
![]() |
![]() |