జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రాన్ని, నియోజవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)ను తమిళ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపై ద్రవిడ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా త్రిభాషా సూత్రాన్ని, డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ సినీ హీరో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకే తీర్మానాలు చేసింది.తమిళనాడులోని తిరువన్మయూర్ లో ఈరోజు టీవీకే తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్టీ అధినేత విజయ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను పార్టీ ఆమోదించింది. జాతీయ విద్యావిధానంలోని మూడు భాషల విధానం ఫెడరలిజానికి విరుద్ధమని పార్టీ అభిప్రాయపడింది. త్రిభాషా సూత్రాన్ని తాము అంగీకరించేది లేదని తెలిపింది. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని చెప్పింది. డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తామని చెప్పింది.ఇదే సమయంలో డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఉద్యోగుల పాత పెన్షన్ పథకంపై ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు చేసిందని విమర్శించింది. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని, దీన్ని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందని దుయ్యబట్టింది. శ్రీలంక అరెస్ట్ చేసిన భారతీయ మత్స్యకారుల అంశంపై స్పందిస్తూ మత్స్యకారులకు టీవీకే అండగా ఉంటుందని తెలిపింది
![]() |
![]() |