రైతు డిమాండ్ల సాధన కోసం కొన్ని నెలలుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగ్జీత్ సింగ్ దల్లేవాల్.. నిజమైన రైతు నాయకుడు అని సుప్రీం కోర్టు ప్రశంసించింది. ఎలాంటి రాజకీయ అజెండా లేకుండా.. కేవలం రైతుల కోసమే ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన ఆయన కృషి అనిర్వచనీయం అంటూ పొగడ్తల వర్షం కురించింది. దాదాపు 487 రోజుల పాటు ఏమీ తినకుండా కనీసం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉన్న ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదికను సమర్పించాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
70 ఏళ్ల వయసు కల్గిన రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ 2024 నవంబర్ 26వ తేదీ నుంచి నిరవధిక నిరసన దీక్ష చేస్తున్నారు. పంజాబ్-హరియాణా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం వద్దే ఉంటూ.. దీక్షను సాగిస్తున్నారు. అయితే ముందు నుంచే ఈ దీక్షను ఆపాలని పంజాబ్ సర్కారు విపరీతంగా కష్టపడింది. ముఖ్యంగా అనేక మంది పోలీసులను పంపి.. టియర్ గ్యాస్, వాటర్ వంటి వాటితో రైతులను చెదరగొట్టే ప్రయత్నాలు చేసింది. కానీ రైతులు, రైతు సంఘాల నాయకులు మాత్రం అస్సలే వెనక్కి తగ్గలేదు. అలాగే రైతు నాయకుడు దల్లేవాల్ దీక్షను విరమింపజేయలేదు.
హైకోర్టు, సుప్రీం కోర్టులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకున్నా ఎవరి మాట వినకుండా ఇన్నాళ్ల పాటు దీక్షను కొనసాగించారు. ఆయన ఆరోగ్యం ఎంతగా క్షీణిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా.. అలా పడుకునే ఉన్నారు. అనేక సార్లు పోలీసులు దల్లేవాల్‌కు కనీసం వైద్య సాయం అందించాలని చూసినా రైతు సంఘాలు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపించాయి. ఈక్రమంలోనే రైతు నాయకుడు దల్లేవాల్.. రైతు ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు అంగీకరిస్తే వైద్యసాయం పొందుతానని చెప్పాడు. ఈక్రమంలోనే పంజాబ్ సర్కారు పలు హామీలు ఇచ్చి ఆయన చేతను దీక్షను విరమింపజేసింది. మార్చి 28వ తేదీ రోజే నీళ్లు తాగించి మరీ ఆయన్ను ఆస్పత్రికి పంపించింది.
అయితే ఇదే విషయాన్ని నేడు పంజాబ్ సర్కారు సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈక్రమంలోనే అత్యున్నత న్యాయస్థానం జగ్జీత్ సింగ్ దల్లేవాల్ నిజమైన కర్షక నాయకుడు అని తెలిపింది. రైతులకు మంచి చేయాలనే ఆలోచన తప్ప.. ఆయనకు మరెలాంటి రాజకీయ అజెండా లేదని పొగిడింది. క్షేత్ర స్థాయిలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన నివేదికను సమర్పించాలని పంజాబ్, హరియాణా ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాకుండా రైతుల ఫిర్యాదులు, అక్కడి స్థితి పరిశీలించి నివేదికలను దాఖలు చేయాలని మాజీ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని ఉన్నతాధికార కమిటీని కోరింది. అలాగే ఇంత కాలం రైతు నాయకుడికి వైద్య సాయం అందించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాన్ని పాటించనందుకు పంజాబ్ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌పై విధించిన కోర్టు ధిక్కార చర్యలను కూడా ఎత్తివేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.
![]() |
![]() |