ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మద్రాస్ ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ విద్యార్థిని సృజన సీఎం చంద్రబాబును ఓ ప్రశ్న అడిగింది. తాను తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన అమ్మాయినని పరిచయం చేసుకున్న సృజన ప్రతి ఇంట్లో టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఏఐ, ఎంఎల్ మెషీన్ లెర్నింగ్ నేర్చుకోవాలి అన్నారు కదా ఏఐ, తదితర టెక్నాలజీలను మరింత అభివృద్ధి పరిచేందుకు విద్యావ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అటువంటి విద్యా వ్యవస్థల్లో ఐఐటీలను ఎలా భాగస్వాములను చేస్తారు అని ప్రశ్నించింది. అందుకు చంద్రబాబు బదులిచ్చారు. నువ్వు ఎప్పుడు పుట్టావమ్మా అని అ అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి 1997లో సర్ అని వెల్లడించింది. అయితే నువ్వు పుట్టడానికి రెండేళ్ల ముందే సీఎంను అయ్యాను నీది ఏ జిల్లా అని అడిగారు. కరీంనగర్ అని ఆ విద్యార్థిని వెల్లడించింది. అక్కడ్నించి చంద్రబాబు తన ప్రసంగం కొనసాగించారు. నువ్వు హైదరాబాద్ ను చూసి ఉంటావు. ఎంత డెవలప్ అయిందో తెలుసు కదా. ఎవరికైనా సరే ఆలోచనలు అనేవి ఉండాలి... వాటిని ఆచరణలో పెట్టాలి. భవిష్యత్ అంతా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానిదే. ఐటీ గురించి పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లో నేను ఐటీ గురించి మాట్లాడాను. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే చాలామందికి తెలియదు. ప్రస్తుతం భారతదేశంలో 68 శాతం మంది ఏఐని ఉపయోగిస్తున్నారు. అంతెందుకు... హైదరాబాద్ ను ఎవరు డెవలప్ చేశారు? అని గూగుల్ అంకుల్ ని అడగండి ఏఐ సాయంతో సమాధానం వస్తుంది. చాలామంది తెలిసో, తెలియకో ఏఐని వినియోగిస్తుంటారు. రియల్ డేటా ఉండాలే కానీ ఏదైనా సాధ్యమే. ఇప్పుడన్నీ సెన్సార్ల సాయంతో అనేక పనులు చక్కబెడుతున్నాం. శరీరంలో గ్లూకోజ్ శాతం ఎంత ఉందో కూడా సెన్సార్లు చెప్పేస్తాయి. దాన్నిబట్టి మనం ఆహారం తీసుకుంటే సరిపోతుంది. నా చేతి వేలికి ఉన్న రింగ్ చూడండి ఇది ఏ పూజారి ఇచ్చిన ఉంగరమో కాదు... ఏ మూఢ నమ్మకాలతో ధరించిన వస్తువో కాదు. ఇదొక మానిటరింగ్ డివైస్. ఉదయం లేవగానే నా శరీరం సంసిద్ధతను ఈ రింగ్ చెప్పేస్తుంది. స్లీప్ స్కోర్, హార్ట్ బీట్... ఇలా అనేక అంశాలను ఈ రింగ్ వెల్లడిస్తుంది. దాన్ని బట్టి నేను నడుచుకుంటాను" అని వివరించారు.
![]() |
![]() |