రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య కొన్నేళ్లుగా యుద్ధం జరుగుతుండగా.. దాన్ని ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఓవైపు జెలెన్ స్కీ, మరోవైపు పుతిన్‌తో చర్చలు జరుపుతూ.. యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని భావిస్తున్నారు. కానీ పుతిన్ మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. అయితే అందుకు కారణం ఏంటనేదాన్ని తాజాగా ఆయన వివరించారు. ముఖ్యంగా జెలెన్‌స్కీ పదవి నుంచి దిగిపోయి.. ఉక్రెయిన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడితేనే తాను శాంతి ఒప్పందంపై సంతకం చేస్తానని చెప్పారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
తాజాగా రష్యాలోని ముక్మాన్క్స్ ప్రాంతంలో పర్యటించిన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనంతరం.. మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈక్రమంలోనే మీడియా ప్రతినిధులు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ప్రశ్నించారు. ఎప్పుడు ఆపబోతున్నారు, ఎవరు ముందు శాంతి ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉందంటూ ప్రశ్నలు అడిగారు. దీనిపై స్పందించిన పుతిన్.. ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పదవీ కాలం గతేడాదే ముగిసిందని చెప్పారు. అయితే ఇప్పటి వరకు అక్కడ ఎన్నికలు జరగలేదని గుర్తు చేశారు. అందువల్లే ఆ దేశంలో ఉన్న అధికార యంత్రాంగం చట్ట విరుద్ధమైందని పుతిన్ వివరించారు.
ఉక్రెయిన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలి
అలాగే శాంతి ఒప్పందంపై ఎవరు ముందుగా సంతకం చేస్తారనేది ఇప్పుడే తెలియదని.. ఆ దేశంలో అధికారంలో ఉన్నది ఎవరో కూడా స్పష్టంగా తెలియదన్నారు. తనకు తెలిసినంత వరకు ఉక్రెయిన్‌లో వేరే నేత అధికారంలోకి రావచ్చని.. ఎన్నికలు కూడా జరగొచ్చని చెప్పారు. ఉక్రెయిన్‌లో ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలని పుతిన్ సూచించారు. అప్పుడే ఆ దేశంలో కొత్తగా ఎన్నికలు జరిగేందుకు వీలు లభిస్తుందన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న జెలెన్‌స్కీ సర్కారుతో చర్చలు జరిపేందుకు తాను విముఖంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఆయన పదివి నుంచి దిగిపోయి.. కొత్త అధ్యక్షుడు వచ్చాక యుద్ధం ముగింపునకు అవసరం అయిన చట్టబద్ధ పత్రాలపై సంతకం చేస్తానన్నారు. ఇది మాత్రమే కాకుండా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు విపరీతంగా కష్ట పడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృషిని ప్రశంసించారు. గత అధ్యక్షుడికి పూర్తి భిన్నంగా ట్రంప్ శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నారు.. దీనికి ఎలాంటి కారణాలు ఉన్నా శాంతిని కోరుకోవడం చాలా ఆయన మంచితనం అంటూ పుతిన్ వ్యాఖ్యానించారు.
![]() |
![]() |