ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాళీ, మరాఠీ తదితర భాషలను బోధిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వం మధ్య కొన్ని రోజులుగా తీవ్ర వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని పాఠశాలల్లో దేశంలోని ఇతర ప్రాంతీయ భాషలను బోధిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల భాషలను బోధిస్తే కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై విమర్శలు గుప్పిస్తూ, స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం త్రిభాషా సూత్రంపై వివాదం రాజేస్తున్నారని ఆరోపించారు. ఇది యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు.యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో తమిళంలో పాఠాలు చెప్పడానికి ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయగలదా అని ప్రశ్నించారు. అలాగే, తమిళ భాషను నేర్చుకోవడానికి ఎంతమంది విద్యార్థులు నమోదు చేసుకున్నారో కూడా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
![]() |
![]() |