పిఠాపురం నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన నూతన రోడ్లను జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ కొత్త రోడ్లను నిర్మించారు. ఇవాళ ఉదయం పిఠాపురం మండలం, కుమారపురం హౌసింగ్ లే అవుట్-1లో రూ. 15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును నాగబాబు శాసనమండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ. 75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
![]() |