దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ మార్చి నెల అమ్మకాలలో 2.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో ఈ వృద్ధి సాధ్యమైందని కంపెనీ పేర్కొంది. కియా గత నెలలో 2,78,058 వాహనాలను విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 2,72,011 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయ అమ్మకాలు 2 శాతం పెరిగి 50,006 యూనిట్లకు చేరుకున్నాయి. విదేశీ అమ్మకాలు 2.2 శాతం పెరిగి 2,27,724 యూనిట్లకు చేరాయి.ఈ సందర్భంగా కియా మోటార్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. "ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే అత్యధిక అమ్మకాలు సాధించాం. జనవరి-మార్చి మధ్య మొత్తం 7,72,351 యూనిట్లను విక్రయించాం. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 1.6 శాతం ఎక్కువ. EV3, స్పోర్టేజ్, సోరెంటో వంటి కీలక మోడళ్ల హైబ్రిడ్ వెర్షన్లు గతేడాది ద్వితీయార్థంలో విడుదలయ్యాయి. ఇవి అమ్మకాలను పెంచడంలో సహాయపడ్డాయని, తద్వారా మొదటి త్రైమాసికంలోనే అత్యధిక పనితీరును కనబరిచాం" అని అన్నారు.అదే సమయంలో హ్యుండాయ్ మోటార్స్ మార్చి నెల అమ్మకాలల్లో తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు క్షీణించడంతో మార్చి నెలలో హ్యుండాయ్ మోటార్స్ అమ్మకాలు 2 శాతం తగ్గాయని ఆ సంస్థ తెలిపింది. గత నెలలో 3,65,812 వాహనాలను విక్రయించగా, గత సంవత్సరం ఇదే నెలలో 3,73,290 యూనిట్లు అమ్ముడయ్యాయి. దేశీయంగా 0.9 శాతం వృద్ధి చెంది 63,090 యూనిట్లు విక్రయించినా, అంతర్జాతీయంగా అమ్మకాలు 2.6 శాతం తగ్గి 3,02,722 యూనిట్లకు పరిమితమయ్యాయి.ఒకే దేశానికి చెందిన రెండు కార్ల కంపెనీల అమ్మకాలలో ఇంత వ్యత్యాసం ఎందుకు కనిపిస్తోందనే దానిపై విశ్లేషకులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. హ్యుండాయ్ పాత మోడల్ కార్ల అమ్మకాలపై దృష్టి పెట్టిందని, కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడంలో వెనుకబడి ఉందని అభిప్రాయపడుతున్నారు. దీనికి విరుద్ధంగా కియా మాత్రం సరికొత్త మోడళ్లను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోందని, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి సారించడం కూడా కియాకు కలిసొచ్చే అంశమని చెబుతున్నారు.
![]() |
![]() |