2018లో నమోదైన ఓ అత్యాచార కేసులో బాజిందర్ సింగ్ అనే క్రైస్తవ బోధకుడికి మొహాలి కోర్టు జీవిత ఖైదు విధించింది. బాధితురాలిని విదేశాలకు తీసుకెళతానని నమ్మించి అత్యాచారం చేసినట్లు బాజిందర్ సింగ్‌పై కేసు నమోదైంది. బాజిందర్ సింగ్ బాధితురాలి అసభ్యకరమైన వీడియోను కూడా తీశాడని ఆరోపణలు ఉన్నాయి. అతడిపై 2018 ఏప్రిల్ 20న మొహాలి జిల్లాలోని జిరాక్‌పూర్‌లో పాస్టర్‌పై భారతీయ శిక్షాస్మృతి (IPC), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. బాజిందర్ తో పాటు మరికొందరిపైనా కేసు నమోదు చేశారు.జలంధర్‌కు చెందిన 42 ఏళ్ల బాజిందర్ సింగ్‌ను మార్చి 28న కోర్టు దోషిగా తేల్చి తీర్పు రిజర్వ్ చేసింది. అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి విక్రాంత్ కుమార్ నేడు తుది తీర్పును వెలువరించారు. బాజిందర్ సింగ్ అద్భుతాలు చేస్తానని, రోగాలను నయం చేస్తానని చెప్పుకునేవాడు. గతంలో కూడా అతడిపై లైంగిక వేధింపులు, మోసం ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో, మరొక మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై అతడి మీద కేసు నమోదు చేశారు. మార్చి 16న చండీగఢ్‌లోని తన కార్యాలయంలో తన సంస్థలో పనిచేస్తున్న మొహాలి నివాసి అయిన ఒక మహిళను అతను కొట్టిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. జలంధర్‌లోని చర్చ్ ఆఫ్ గ్లోరీ అండ్ విజ్డమ్ అనే చర్చిలో తనను లైంగికంగా వేధించాడని సదరు మహిళ పాస్టర్‌పై ఫిర్యాదు చేసింది. అతను తనకు అసభ్యకరమైన సందేశాలు పంపేవాడని, తన క్యాబిన్‌కు ఒంటరిగా రమ్మని పిలిచేవాడని, అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమె పేర్కొంది.ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు పోలీస్ సూపరింటెండెంట్ రూపేందర్ కౌర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) పోలీసులు ఏర్పాటు చేశారు. అలాగే, పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ విషయంపై సుమోటోగా నోటీసు తీసుకుని ఫిర్యాదుదారుకు భద్రత కల్పించాలని ఆదేశించింది. 2022లో బాజిందర్ సింగ్ ఢిల్లీకి చెందిన ఒక కుటుంబం నుంచి వారి కుమార్తె అనారోగ్యం నయం చేస్తానని డబ్బు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి, అయితే ఆమెను కాపాడలేకపోయారు.
![]() |
![]() |