మరాఠా యోధుడు శివాజీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చంపేయాలనుకుని విఫలమయ్యాడని చివరకు ఆయనే మహారాష్ట్రలో చనిపోయాడని ఎంఎన్ఎస్ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే అన్నారు. ఔరంగజేబ్ సమాధిని కూల్చివేయాలంటూ డిమాండ్లు వస్తున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబ్ సమాధి అంశాన్ని మతం, కులం కోణంలో చూడరాదని చెప్పారు. మరాఠాలను తుడిచిపెట్టాలని వీళ్లు ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. చరిత్రను వాట్సాప్ లో కాకుండా చరిత్ర పుస్తకాల్లో చదవాలని హితవు పలికారు. బాలీవుడ్ సినిమా 'చావా' చూసిన తర్వాతే మీకు ఛత్రపతి శంభాజీ మహరాజ్ గురించి తెలిసిందా అని ప్రశ్నించారు. ఒక సినిమా ను చూసిన తర్వాత హిందువులు మేల్కొనడం ద్వారా వచ్చే ఉపయోగం ఏమీ ఉండదని చెప్పారు. విక్కీ కౌశల్ నుంచి శంభాజీ మహరాజ్ అక్షయ్ ఖన్నా నుంచి ఔరంగజేబ్ చరిత్రను తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా 'చావా'ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శంభాజీని ఔరంగజేబ్ చిత్రహింసలు పెట్టి, ఉరితీయించాడు. ఔరంగజేబ్ గుజరాత్ లోని దహోద్ లో జన్మించాడని స్వలాభం చూసుకునే రాజకీయ నాయకులు అసలైన చరిత్రను పట్టించుకోరని రాజ్ థాకరే విమర్శించారు. బీజాపూర్ జనరల్ అఫ్జల్ ఖాన్ ను ప్రతాప్ గఢ్ కోట వద్ద సమాధి చేశారని శివాజీ అనుమతి లేకుండానే ఆయనను అక్కడ సమాధి చేయగలరా అని ప్రశ్నించారు. మతం ఆధారంగా ఏ దేశం కూడా అభివృద్ధి చెందలేదని చెప్పారు. టర్కీ దేశం తనను తాను సంస్కరించుకుని ఎలా ఎదిగిందో అందరూ గమనించాలని అన్నారు. మతం అనేది ఇంటి నాలుగు గోడల మధ్యే ఉండాలని చెప్పారు. ముస్లింలు రోడ్ల మీదకు వచ్చినప్పుడు, అల్లర్లకు పాల్పడినప్పుడు మాత్రమే మనం హిందువులం అనే విషయం మనకు గుర్తుకు వస్తుందని అన్నారు. వాస్తవానికి హిందువులు మత పరంగా విడిపోలేదని కులాల పరంగా విడిపోయారని చెప్పారు.మరాఠీ భాషను అధికారిక వ్యవహారాల్లో వినియోగించడం తప్పనిసరి చేయాలని రాజ్ థాకరే డిమాండ్ చేశారు. మీరు మహారాష్ట్రలో ఉంటూ ఇక్కడి భాషను మాట్లాడకపోతే తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మతం పేరుతో నదులను కలుషితం చేయడంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కాల్చివేసిన శవాలను గంగానదిలో పడేస్తున్న వీడియోలను ఆయన చూపించారు. మతం పేరుతో మన సహజ వనరులను మనమే నాశనం చేసుకుంటున్నామని విమర్శించారు. గంగానదిని పరిశుభ్రం చేయడానికి రూ. 33 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారని, ఇంకా ఖర్చు చేస్తున్నారని రాజ్ థాకరే చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు సంస్కరించుకోవాలని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మహారాష్ట్రలోని నదులు కూడా అత్యంత కలుషితంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో అత్యంత కలుషితమైన నదులు 311 ఉన్నాయని వాటిలో, 55 నదులు మహారాష్ట్రలోనే ఉన్నాయని తెలిపారు. ముంబైలో ఐదు నదులు ఉంటే... వాటిలో నాలుగు నదులను జనాలు ఇప్పటికే చంపేశారని చెప్పారు. జీవంతో ఉన్న 'మితి' నది కూడా చావడానికి సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మురికినీరు, రసాయన వ్యర్థాలు, ఆక్రమణలు నీటి వనరులను చంపేస్తున్నాయని అన్నారు. వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హితవు పలికారు.
![]() |
![]() |