ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ఓటింగ్‌కు ముందు యూటర్న్ తీసుకున్న బీజేడీ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 08:31 PM

 


 


 


10


 


 


 


Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu | Updated: 4 Apr 2025, 12:58 pm


Subscribe


 


 


వక్ఫ్ బోర్డుకు ఉన్న అపరిమిత అధికారాలను నియంత్రించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టం 1995కి సవరణలు చేస్తూ బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదం లభించింది. అధికార, విపక్షాల వాదనల మధ్య వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 చివరకు పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ బిల్లుపై రాజ్యసభలో గురువారం సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం తర్వాత ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటు వేశారు. గురువారం అర్ధరాత్రి వరకు రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగింది. ప్రతిపక్షాలు చేసిన సవరణలను సభ తిరస్కరించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. ఈ బిల్లు వక్ఫ్ బోర్డు పనితీరును మెరుగుపరచడానికి, పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించిందని, ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆయన పునరుద్ఘాటించారు.


 ‘ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం తమ ప్రభుత్వం ఉద్దేశం కాదు’ అని ఆయన అన్నారు. ఈ బిల్లు ఉద్దేశం సంక్లిష్టతలను తొలగించడం, పారదర్శకతను తీసుకురావడం, సాంకేతికతను ఉపయోగించి వక్ఫ్ బోర్డు పనితీరును మెరుగుపరచడం అని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లుకు మతంతో సంబంధం లేదని రిజుజు నొక్కి చెప్పారు. అన్ని వర్గాల ముస్లింలను వక్ఫ్ బోర్డులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. 2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు 8.72 లక్షలకు పెరిగాయని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వాలు నెరవేర్చని లక్ష్యాలను పూర్తి చేయడానికే ఈ బిల్లును తీసుకువచ్చామని, ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన విపక్షాలను కోరారు.


ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన మంత్రి రిజిజు.. ముస్లింల హక్కులను ఈ బిల్లు హరించదని ఆయన స్పష్టం చేశారు. షియా, సున్నీలతో పాటు ఇతర వెనుకబడిన తరగతుల వారు వక్ఫ్ బోర్డు సభ్యులుగా కొనసాగేలా కొత్త నిబంధనలు చేర్చామని ఆయన చెప్పారు. 22 మంది సభ్యులతో ఏర్పడే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూర్పుపై వస్తున్న సందేహాలకు ఆయన సమాధానమిచ్చారు. "ముస్లిమేతరులు అత్యధికంగా ఉంటారనే సమస్యే ఉత్పన్నం కాదు" అని ఆయన అన్నారు.


అయితే, వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ముందురోజు ప్రకటించిన బిజూ జనతా దళ్‌ (బీజేడీ)... యూటర్న్ తీసుకుంది. రాజ్యసభలో ఓటింగ్ ముందు గేట్లు తెరిచింది. తమ ఎంపీలకు విప్‌ జారీచేయని ఆ పార్టీ.. ఆత్మ ప్రభోదానుసారం వారు ఓటు వేస్తారని పేర్కొంది. **మేము వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 విషయంలో వివిధ మైనారిటీల భావోద్వేగాలను లోతుగా గౌరవిస్తాం... మా పార్టీ... రాజ్యసభలో మా గౌరవనీయ సభ్యులకు, ఈ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు, న్యాయం, సామరస్యం, అన్ని సముదాయాల హక్కులు, ఉత్తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మనఃసాక్షిగా ఓటేయడానికి అనుమతించింది. ఈ విషయంలో ఎటువంటి పార్టీ విప్ లేదు.’’ అని ఆ బీజేడీ నేత సస్మిత్ పాత్ర ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.


కానీ, రాజ్యసభలో బీజేడీ ఎంపీ ముజిబుల్లా ఖాన్‌...ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. అటు, వైఎస్ఆర్‌సీపీ సైతం బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించినా.. తమ ఎంపీలకు విప్ జారీచేసింది. ఆ పార్టీకి రాజ్యసభలో ఏడుగురు సభ్యలు ఉన్నారు. అటు, అన్నాడీఎంకే, బీఎస్పీలు విప్ జారీచేయలేదు. ఇక అధికార ఎన్డీయేకు రాజ్యసభలో 125 సంఖ్యా బలం ఉంటే.. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు వచ్చాయి. అంటే అదనంగా ముగ్గురు ఓటేశారు. దీంతో బిల్లుకు అనుకూలంగా ఓటేసిన ఆ ముగ్గురు ఎవరు? అనేది తెలియదు.


ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), వామపక్షాలు, టీఎంసీ సహా 95 సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తం 252 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రస్తుతం 236 మంది ఉన్నారు. గురువారం 223 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 13 మంది సభకు గైర్హాజరుకాలేదు. ఈ 13 మంది ఎవరు? ఏ పార్టీ సభ్యులు అనేది తెలియాల్సి ఉంది. విప్ జారీచేయని పార్టీలకు చెందిన సభ్యులు అయ్యి ఉంటారని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com