ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిచ్చిన టీడీపీ, జేడీయూలు,,,ఆ పార్టీలను ఒప్పించడంలో సఫలమైన బీజేపీ

national |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 08:29 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్ (యూ) లాంటి లౌకిక పార్టీలు వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. కానీ దీని వెనుక వివాదాస్పద అంశాలపై భాగస్వాముల మద్దతు సాధించాలన్న బీజేపీ ప్రయత్నమే ఉంది అని వర్గాలు తెలిపాయి. సాంప్రదాయంగా ముస్లింల మద్దతుపై ఆధారపడి ఉన్న టీడీపీ, జేడీయూలు ఆ వర్గానికి సంబంధించిన అంశాలలో ముఖ్యంగా ఉమ్మడి పౌరస్మృతిచట్టం వంటి విషయాల్లో బీజేపీకి భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కానీ, వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ఈ పార్టీలు మద్దతిచ్చేలా బీజేపీ ఒప్పించడంలో విజయం సాధించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.


గత ఆగస్టులో వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి ముందు దీని ప్రాముఖ్యతను టీడీపీ, జేడీయూ నాయకత్వానికి కేంద్ర మంత్రులు వివరించారు. అలాగే మిగతా మిత్రపక్షాలైన లోక్ జనశక్తి (చిరాగ్ పాశ్వాన్) రాష్ట్రీయ లోక్‌ దళ్ (జయంత్ చౌదరి) పార్టీ నేతలతోనూ చర్చించి.. ఈ బిల్లు ముస్లిం హక్కులను కాపాడడం, మహిళలకు హక్కులు కల్పించడానికే ఉద్దేశించిందని స్పష్టంచేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా సమాజాన్ని విభజించడం దీని ఉద్దేశం కాదని వివరించారు.


బిల్లు ముఖ్య ఉద్దేశంతో మిత్రపక్షాలు ఏకీభవించినా.. కొన్ని నిబంధనలపై ముఖ్యంగా వక్ఫ్ ఆస్తులు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలపై ప్రభావం విషయాల్లో సందేహాలు వ్యక్తం చేశాయి. దీంతో బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి.. జేడీయూ, టీడీపీ సూచించిన కీలక మార్పులతో పాటు మొత్తం 14 సవరణలను ఆమోదించారు.


కొత్త చట్టం ఇప్పటికే ఉన్న మసీదులు, దర్గాలు, ఇతర ముస్లిం ప్రార్థనా స్థలాలపై ప్రభావం ఉండకుండా చూసుకోవాలని జేడీయూ ప్రతిపాదించింది. అలాగే, వక్ఫ్ భూములపై తీసుకునే నిర్ణయాలలో రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే భూమి అనేది రాష్ట్ర అధీనంలో అంశమని సూచించింది.


ఇక, టీడీపీ విషయానికి వస్తే రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారాన్ని కాపాడాలని, అలాగే వివాదాల పరిష్కారానికి కలెక్టర్ స్థాయి అధికారులను నియమించాలని, వక్ఫ్ సంబంధిత పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడానికి నిర్దిష్ట గడువు ఉండాలని కోరింది. ఈ ప్రతిపాదనలను బిల్లులో చేర్చడంతో క్యాబినెట్ ఆమోదం లభించింది.


బిల్లుకు మద్దతు ప్రకటించిన జేడీయూ, టీడీపీ నాయకులు.. ఇది ముస్లిం మహిళలు, అణచివేయబడిన వర్గాల ప్రయోజనాలకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఎల్జేపీ, ఆర్ఎల్డీ కూడా బిల్లుకు మద్దతు ఇచ్చాయి.


జేడీయూ నేతలతో అమిత్ షా భేటీ


జేపీపీ సవరణల అనంతరం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పార్లమెంట్ హౌస్‌లో జేడీయూ సీనియర్ నేతలు లలన్ సింగ్, సంజయ్ ఝాతో భేటీ అయ్యారు. వారి సూచనలను బిల్లులో చేర్చినట్టు తెలియజేశారు.


దీంతో లోక్‌సభ చర్చలో లలన్ సింగ్ ఈ బిల్లుకు గట్టి మద్దతు ఇచ్చి.. ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకం అన్న ఆరోపణలను తిరస్కరించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముస్లింల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విషయాలను లలన్ సింగ్ అనేకసార్లు గుర్తుచేశారు.


అటు, టీడీపీకి చెందిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ముస్లిం మహిళలు, యువత, అణచివేతకు గురైన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లుకు టీడీపీ మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. ఎన్డీయేలోని మిగతా మిత్రపక్షాలైన ఎల్జేపీ, హిందుస్తాన్ అవామ్ మోర్చా, ఆర్ఎల్డీ కూడా ఇదే దృష్టితో మద్దతు ఇచ్చాయి. ఈ బిల్లుపై మిత్రపక్షాల మద్దతు పొందడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ శైలి, ఆయనపై ఉన్న నమ్మకాన్ని సూచిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com