ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిమ్‌స్టెక్‌లో థాయ్‌ ప్రధాని విందు.. పక్క పక్కనే మోదీ, యూనస్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 07:49 PM

బ్యాంకాక్‌లో జరుగుతోన్న బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో-ఆపరేషన్ (బిమ్‌స్టెక్) శిఖరాగ్ర సదస్సుకు హాజరైన సభ్య దేశాధినేతలకు థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా విందు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ విందులో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్‌లు పక్కపక్కనే కూర్చుని కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను యూనస్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టారు. మోదీకి ఓవైపు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. ఇంకోవైపు యూనస్ కూర్చున్నారు. డిన్నర్ సమయంలో ఇరువురు నేతలూ కలుసుకున్నట్టు యూనస్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ అబుల్ కలామ్ అజాద్ వ్యాఖ్యలను బంగ్లాదేశ్ మీడియా ఉటంకించింది.


బ్యాంకాక్‌లో జరుగుతోన్న బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇద్దరు నాయకులు తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలు జరపాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరుకుంటోంది. బిమ్‌స్టెక్ అధ్యక్ష బాధ్యతలను బంగ్లాదేశ్‌కు శుక్రవారం అందజేయనున్నారు. రోహింగ్యాలు, ప్రాధాన్యతా అంశాలపై యూనస్‌కు ఉన్నత ప్రతినిధి అయిన ఖలీలూర్ రెహమాన్ బుధవారం మాట్లాడుతూ.. బిమ్‌స్టెక్ సభ్య దేశాల నాయకులు భవిష్యత్తు కార్యాచరణ గురించి యూనస్‌తో చర్చిస్తారని పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూనస్ మధ్య సమావేశం జరిగే అవకాశం ఉందని అన్నారు. ‘ఈ చర్చను (రెండు దేశాల నాయకుల మధ్య) నిర్వహించాలని మేము భారతదేశాన్ని అభ్యర్థించాం..... ఇరువురి భేటీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది’ అని బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశానికి ముందు బంగ్లాదేశ్‌లో విలేకరుల సమావేశంలో రెహమాన్ వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉండగా, గతవారం బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. యూనస్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని భాగస్వామి చరిత్రగా అభివర్ణించారు. ‘‘శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ఉమ్మడి ఆకాంక్షలు.. ప్రయోజనాలు.. ఆందోళనలకు పరస్పర చర్చల ఆధారంగా ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


బంగ్లాదేశ్‌లో రోజు రోజుకూ దిగజారుతోన్న శాంతి భద్రతలు, పరిస్థితులపై బారత్ తీవ్ర ఆందోళన చెందుతోంది. గతేడాది ఆగస్టులో షేక్ హీసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యూనస్ నాయకత్వంలోనే ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం అనుసరిస్తోన్న తీవ్రవాద విధానాలు, వేర్పాటువాదులను జైళ్ల నుంచి విడుదల చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.


‘‘మేము స్థిరత్వం, శాంతియుత, సమగ్రతతో కూడిన.. పురోగమించే బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తున్నాం.., అన్ని సమస్యలు ప్రజాస్వామ్య మార్గాల్లో సమగ్రంగా, ప్రజాప్రాతినిధ్యంతో కూడిన ఎన్నికల ద్వారా పరిష్కరమవుతాయి.. అయితే, తీవ్రమైన నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఉగ్రవాదులను విడుదల చేయడం వల్ల మరింత క్షీణించిన న్యాయవ్యవస్థ, శాంతిభద్రతల పరిస్థితిపై మేం ఆందోళన చెందుతున్నాం’’ అని విదేశాంగ శాఖ మంత్రి రణధీర్ జైశ్వాల్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.


షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇటీవల చైనా పర్యటనకు వెళ్లిన ముహమ్మద్ యూనస్.. భారత్‌‌పై విషం గక్కారు. తమ దేశంలో పెట్టుబడులతో భారత ఈశాన్య రాష్ట్రాల్లో చైనా విస్తరించాలని ఆయన చేసిన ప్రకటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ పరిణామాల వేళ ప్రధాని మోదీ, యూనస్‌లు పక్కపక్కనే కూర్చుని విందు ఆరగించడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com