ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొలీవియాలో భూములు కొట్టేసేందుకు పథకం,,,విదేశాల్లోనూ వివాదాస్పద స్వామి నిత్యానంద లీలలు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 07:47 PM

వివాదాస్పద స్వామి నిత్యానంద మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నిత్యానంద సోదరి కుమారుడు సుందరేశ్వరన్ పేరుతో ఓ వీడియా చక్కర్లు కొట్టింది ఈ వీడియోలో నిత్యానంద కన్నుమూశారని, ఆయన జీవితాంతం హిందూ ధర్మం కోసమే పోరాటం చేశారని అతడు చెప్పడంతో ఇది నిజమే అనుకున్నారు. కానీ, ఇదంతా ఏప్రిల్ ఫూల్ అని తర్వాత తెలియడంతో జనం అవాక్క్యయ్యారు. మానవ అక్రమ రవాణా, చిన్నారుల నిర్బంధం, లైంగిక వేధింపులు సహ పలు కేసుల్లో ఇరుక్కుని.. 2019 నుంచి పరారీలో ఉన్న వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చనిపోయినట్టు నిత్యానంద అందర్నీ ఏప్రిల్ ఫూల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, దక్షిణ అమెరికాలోని బొలీవీయాలో అమెజాన్ అటవీ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించినట్టు వెలుగులోకి వచ్చింది. అతడి అనుచరులు భూ ఆక్రమణకు (Land Grabbing) ప్రయత్నించి... స్థానిక తెగలతో లీజుకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడయ్యింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో మొత్తం 21 మందిని అరెస్ట్ చేసిన బొలీవియా అధికారులు.. వీరందర్నీ వారి వారి దేశాలకు పంపించారు.


భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద.. ఈక్విడార్ సమీపంలోని ఓ దీవికి కైలాస అనే పేరు పెట్టినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కైలాస దేశంతో సంబంధమున్న కొందరు ఇటీవల బొలీవియాలో పర్యటించి.. కార్చిచ్చును ఎదుర్కోవడంలో స్థానికులకు సాయపడ్డారు. ఈ క్రమంలో ఆ భూములపై కన్నేసిన వీరు.. లీజు కోసం స్థానిక తెగలతో ఒప్పందాలు సైతం చేసుకున్నారు. బొలీవియా అధ్యక్షుడు లూయిస్‌ ఆర్స్‌తోనూ ఫొటోలు దిగారు. చివరకు 2 లక్షల డాలర్లకు ఢిల్లీకి మూడు రెట్లు ఎక్కువ విస్తీర్ణం ఉండే ప్రాంతాన్ని 25 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడానికి స్థానిక తెగ ప్రతినిధి ఒప్పుకున్నాడు.


కానీ, నిత్యానంద ప్రతినిధులు మాత్రం వెయ్యేళ్లు లీజుతో పాటు గగనతల వినియోగం, సహజవనరులు, గనుల తవ్వకాలు వంటి ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై బొలీవియా వార్త పత్రిక ఒకటి ఇన్వెస్టిగేషన్ కథనం ప్రచురించడంతో నిత్యానంద కుట్ర బయటపడింది. దీంతో అప్రమత్తమైన లూయిస్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కైలాసతో సంబంధమున్న 21 మందిని అదుపులోకి తీసుకుంది. వారు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి.. సంబంధిత వ్యక్తులను వారివారి దేశాలకు (భారత్‌, చైనా, అమెరికా) పంపించింది.


పర్యటకులుగా పలుసార్లు బొలీవియాకు వచ్చిన వీరు.. స్థానికులతో ఒప్పందాలు చేసుకున్నారని ఇమిగ్రేషన్‌ అధికారులు తెలిపారు. గతేడాది నవంబరు నుంచి కొందరు అక్కడే ఉండిపోయినట్టు గుర్తించామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బొలివియా విదేశాంగ మంత్రి న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. వివాదాస్పద యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసతో తమకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవని స్పష్టం చేశారు.


నిత్యానంద కైలాస ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్న తెగ నాయకుడు పెడ్రో గ్వాసికో మాట్లాడుతూ... 2024 చివరిలోనే భూముల లీజు గురించి తమను సంప్రదించారని తెలిపారు. కార్చిచ్చు ఆర్పేందుకు సాయం చేసినట్టే చేసి.. లీజు గురించి ప్రస్తావన తీసుకొచ్చారన్నారు. ‘‘మేము వాళ్ల మాటలు విని మోసపోయాం.. మా భూమిని తీసుకుని ఏడాదికి కొంత మొత్తం ఇస్తామని ఆశపెట్టారు. కానీ అది పూర్తిగా తప్పు’’ అని తెలిపారు.. ఇదిలా ఉండగా, కైలాస ఎక్కడ ఉందన్న దానిపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇటీవల ఓ కేసుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కూడా నిత్యానంద ఈక్వెడార్‌లో ఉన్నట్లు మద్రాసు హైకోర్టుకు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com