కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 చివరకు పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ బిల్లుపై రెండు రోజుల పాటు లోక్‌సభ, రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఉభయ సభల్లోనూ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టి.. ప్రతిపక్షాల అభ్యంతరాలకు గట్టిగా సమాధానం ఇచ్చారు. పార్లమెంట్ ఆమోదించిన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు 2025ను త్వరలోనే సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటించింది. ‘వక్ఫ్ (సవరణ) బిల్లు 2024 చట్టబద్ధతను అతి త్వరలోనే సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయనున్నాం’ అని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘భారత రాజ్యాంగ సూత్రాలు, నిబంధనలు, విధానాలపై మోదీ ప్రభుత్వం చేసే అన్ని దాడులను మేము ప్రతిఘటిస్తూనే ఉంటాం.. ఈ విషయంలో మేము నమ్మకంగా ఉన్నాం’ అని తెలిపారు. వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింలకు వ్యతిరేకమైందని విమర్శిస్తున్నాయి.
అయితే, చారిత్రాత్మక సంస్కరణగా అభివర్ణించిన ప్రభుత్వం.. ముస్లిం మహిళలు, అణచివేతకు గురైన మైనారిటీలకు మేలు చేస్తుందని తెలిపింది. గురువారం ఈ బిల్లుకు రాజ్యసభలో 128 మంది అనుకూలంగా, 95 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతకు ముందు బుధవారం లోక్‌సభలో 288 మంది మద్దతు తెలపడంతో ఆమోదం పొందింది.
కేంద్రం 2019లో ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం పై కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ సైతం సుప్రీం కోర్టు విచారణలో ఉందని జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. అలాగే, 2019 సమాచార హక్కు సవరణ చట్టం , 2024 ఎన్నికల నియమావళి సవరణల చట్టబద్ధతపై కూడా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నాయి. అలాగే, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత దేశంలోని ప్రార్థనా స్థలాలు యథాతథ స్థితిని కొనసాగించేందుకు తీసుకొచ్చిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం 1991 కూడా సుప్రీం కోర్టు విచారణలో ఉందని జైరామ్ రమేశ్ తెలిపారు.
ఇదిలా ఉండగా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా.. బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రస్తుత చట్టంలోని నిబంధనలు కాలపరీక్షకు నిలిచాయని, వక్ఫ్ ఆస్తులకు రక్షణ కల్పించాయని ఆ లేఖలో స్టాలిన్ తెలిపారు. కానీ, కొత్తగా తీసుసువస్తున్న సవరణలు వక్ఫ్ నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు సంబంధించి బోర్డులకున్న అధికారాలు, బాధ్యతలను బలహీనపరిచేవిగా ఉన్నాయని అన్నారు.
అయితే, ‘ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం తమ ప్రభుత్వం ఉద్దేశం కాదు’ అని మైనార్టీ వ్వవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు. ఈ బిల్లు ఉద్దేశం సంక్లిష్టతలను తొలగించడం, పారదర్శకతను తీసుకురావడం, సాంకేతికతను ఉపయోగించి వక్ఫ్ బోర్డు పనితీరును మెరుగుపరచడం అని ఆయన పేర్కొన్నారు.
![]() |
![]() |