ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయంగా అనిశ్చితి.. మూడో ప్రపంచ యుద్ధంపై సంచలన జోస్యం

national |  Suryaa Desk  | Published : Mon, Apr 07, 2025, 09:27 PM

మూడో ప్రపంచ యుద్ధం.. ఇది చాన్నాళ్లుగా ఈ మాట వినిపిస్తోంది. మూడేళ్ల కిందట రష్యా- ఉక్రెయిన్ మధ్య సంఘర్షణ మొదలైనప్పుడు.. గాజాలో హమాస్‌పై ఇజ్రాయేల్ దాడులు ప్రారంభమైనప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. తాజాగా, ట్రంప్ ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందనే అంచనాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మూడో వరల్డ్ వార్ గురించి జ్యోతిషుడి అంచనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. నవంబర్ 2028 - డిసెంబర్ 2032 మధ్య, మూడో ప్రపంచ యుద్ధం అనివార్యంగా కనిపిస్తోందని భారత్‌కు చెందిన రుద్రప్రతాప్ కరన్ సింగ్ అనే జ్యోతిషుడు అంచనా వేశారు ఆయన ప్రకారం.. నవంబరు 2028- డిసెంబరు 2032 మధ్య భరణి (యమ) నక్షత్రంలోకి శని.. అగ్ని తత్వమైన ధనుస్సు రాశిలోకి రాహువు సంచారం వల్ల, ఈ కాలం భారీ విధ్వంసం, ప్రాణనష్టాన్ని కలిగిస్తుందని భావిస్తున్నారు.


చరిత్రలో ఇది ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని, భారీ ఆస్తి నష్టం, స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణతతో ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చిన ఆయన అంటున్నారు. భరణి నక్షత్రం నిగ్రహం, పరివర్తనకు సూచన అని.. రక్షణ, ఫార్మా రంగాల వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి పెట్టుబడుల విషయంలో తెలివిగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఈ గందరగోళం తర్వాత సానుకూల నవ శకం ఆవిర్భవిస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.


ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆర్ధిక మాంద్యం భయాలు కూడా వెంటాడుతున్నాయి. అయితే, స్టాక్ మార్కెట్‌ ట్రేడింగ్ అంత సానుకూలంగా ఉండదని మార్చిలోనే ఆయన జోస్యం చెప్పడం గమనార్హం. అంతేకాదు, జులై-ఆగస్టులో అంతర్జాతీయ మార్కెట్లు కఠిన సవాళ్లను ఎదుర్కొంటాయని, పెట్టుబడుల విషయంలో తెలివిగా వ్యవహరించాలని సూచించారు. లిక్విడ్ క్యాష్ అట్టిపెట్టుకుని.. సరైన అవకాశం వచ్చినప్పుడు పెట్టుబడి పెట్టాలని స్టాక్ మార్కెట్‌లపై నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.


ట్రంప్ టారిఫ్‌లపై పలు దేశాలు ఇప్పటికే స్పందించాయి. తమపై అమెరికా విధించిన సుంకాలకంటే అధిక మొత్తంలో వడ్డింపులు మొదలెట్టాయి. అమెరికా ఆటో ఉత్పత్తులపై కెనడా 25 శాతం సుంకాలు విధించింది. ఇక, తమపై ట్రంప్ విధించిన 34 శాతం సుంకాలకు బదులుగా చైనా కూడా అంతేస్తాయిలో సుంకాలు విధించి దెబ్బకు దెబ్బ తీసింది. దీంతో పాటు అత్యవసరమైన పలు అరుదైన ఖనిజాల ఎగుమతులపైనా డ్రాగన్ దేశం నియంత్రణ ప్రకటించింది. ఈ పరిణామాలు యుద్ధ భయాలను పెంచుతున్నాయి.


గతంలో ఫలించిన అంచనాలు


కాగా, రుద్రపత్రాప్ కరన్ సింగ్ గతంలో చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతారని గతేడాది మార్చిలోనే ఈయన జోస్యం చెప్పారు. సింగ్ జోస్యం చెప్పినట్టే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర ఓటమి చవిచూసింది. అంతేకాదు, గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలపై కూడా అంచనా వేసినట్టే ఫలితాలు వచ్చాయి. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని, కానీ బీజేపీకి పూర్తి మెజార్టీ రాదని జోస్యం చెప్పారు. మరి ఆయన అంచనా నిజమైతే నవంబరు 2028 నుంచి డిసెంబరు 2032 మధ్య మూడో ప్రపంచ యుద్ధం కోసం సిద్ధంగా ఉండాల్సిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com