తమిళనాడులో ఇటీవల టీవీకే పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీని ఢీకొట్టేందుకు సిద్ధమైన ప్రముఖ సినీనటుడు విజయ్, వక్ఫ్ సవరణ చట్టంపై కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ సవరణ చట్టం - 2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ అంశంపై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, తాజాగా విజయ్ కూడా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.కాగా, వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ నెల 16న విచారణ జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే పది పిటిషన్లు దాఖలు కాగా, మరికొన్ని త్రిసభ్య ధర్మాసనం ముందు లిస్ట్ కావాల్సి ఉంది. వీటన్నింటిపైనా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథ్ తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.అయితే, ఈ నెల 15న విచారణ చేపడతామని తొలుత ధర్మాసనం తెలిపింది. కానీ కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం దీనిపై కేవియట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్లను ఈ నెల 16న విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
![]() |
![]() |