ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలో తెలుసా

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 10:43 PM

ఐపీఎల్ 2025 సగం సీజన్ ముగిసింది. ఇక ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడితే ఏది ప్లే ఆఫ్స్‌కి వెళ్తుంది.. ఏది ఇంటి దారి పడుతోందో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. రాజస్థాన్ రాయల్స్ దాదాపు ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయినట్టే అని చెప్పొచ్చు. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్‌లో ఒక జట్టు భవిష్యత్ ఏంటో ఈరోజు తేలనుంది. ప్రస్తుతానికి ఆరు జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి.


ఐపీఎల్ పాయింట్ల పట్టిక ప్రకారం రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ ఛాన్స్‌లు కోల్పోయింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తొమ్మిది పది స్థానాల్లో ఉన్నాయి. టాప్ 4లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు వరుస స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్, లక్నో కూడా ప్లే ఆఫ్ రేసులో దూసుకుపోతున్నాయి.


ఏ జట్టుకు ఎంత అవకాశం అంటే?


గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టొచ్చు. ఆర్సీబీ మిగిలిన ఐదు మ్యాచ్‌లలో రెండు కచ్చితంగా గెలవాలి. పంజాబ్ కింగ్స్ ఆరు మ్యాచ్‌లలో మూడు, ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్‌లలో మూడు తప్పకుండా గెలిస్తే ప్లే ఆఫ్స్‌కి ఛాన్స్.


లక్నో సూపర్ జెయింట్స్ ఐదు మ్యాచ్‌లలో మూడు కచ్చితంగా గెలవాలి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిస్తే ఛాన్స్ ఉంటుంది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో ఆరూ గెలవాల్సిందే. ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కి చేరుకునే అవకాశాలు దాదాపు లేనట్టే.


ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్


గుజరాత్ టైటాన్స్ జట్టు ఎనిమిది మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా 12 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మూడు జట్లకు 12 పాయింట్లు ఉన్నప్పటికీ రన్‌రేట్ ఆధారంగా గుజరాత్ టాప్‌లో నిలిచింది.


మొన్నటి వరకు అడుగున ఉన్న ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో పది పాయింట్లతో నాలుగో స్థానానికి వచ్చింది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు కూడా పది పాయింట్లతో ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్ నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్, చెన్నై రెండ్రెండు మ్యాచ్‌లు గెలిచి తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com