ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత వెబ్‌సైట్లపై 15 లక్షలకుపైగా పాక్‌ హ్యాకర్ల సైబర్ దాడులు

national |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 08:00 PM

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌పై.. పాకిస్తాన్ సైబర్ దాడులకు తెగబడింది. ఏకంగా 15 లక్షల భారత వెబ్‌సైట్లపై దాడులు జరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం గుర్తించింది. అయితే కేవలం 0.01 శాతం పాక్ దాడులు మాత్రమే సక్సెస్ అయ్యాయని.. మిగిలిన 99.99 శాతం సైబర్ దాడులను తాము సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అధికారులు వెల్లడించారు. భారత్‌లోని ముఖ్యమైన వెబ్‌సైట్‌లే లక్ష్యంగా ఏకంగా 15 లక్షలకు పైగా సైబర్ దాడులు జరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం గుర్తించింది. ఈ దాడులకు పాల్పడిన 7 అడ్వాన్స్‌డ్ పర్‌సిస్టెంట్ థ్రెట్ (ఏపీటీ) గ్రూపులను కూడా గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ 15 లక్షల సైబర్ దాడుల్లో కేవలం 150 మాత్రమే విజయవంతం అయ్యాయని.. మిగిలిన 99.99 శాతం సైబర్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు స్పష్టం చేశారు.


పాకిస్తాన్‌ హ్యాకింగ్ గ్రూపులు చేసిన సైబర్ దాడులకు సంబంధించిన వివరాలను మహారాష్ట్ర సైబర్ విభాగం "రోడ్ ఆఫ్ సింధూర్" రిపోర్ట్‌లో చేర్చింది. ఈ రిపోర్ట్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌తో సహా అన్ని కీలక సంస్థలకు సమర్పించింది. అయితే ఈ సైబర్ దాడులు ఎక్కడెక్కడి నుంచి జరిగాయనేది కూడా వెల్లడించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మధ్యప్రాచ్యం, ఇండోనేషియాకు చెందిన గ్రూప్‌ల నుంచి వచ్చాయని మహారాష్ట్ర సైబర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి యాదవ్ వివరించారు.


భారత్-పాక్ కాల్పుల విరమణ తర్వాత హ్యాకర్ల దాడులు


కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ అంగీకరించిన తర్వాత కూడా భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లు భారీగా సైబర్ దాడులు ఎదుర్కొంటున్నాయని అధికారులు వెల్లడించారు. సైబర్ దాడులు తగ్గినా పూర్తిగా ఆగలేదని పేర్కొన్నారు. అదే సమయంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఎలక్షన్ కమిషన్, ఇతర కీలక సంస్థల వెబ్‌సైట్‌ల నుంచి హ్యాకర్లు డేటాను దొంగిలించారనే వాదనలను మహారాష్ట్ర సైబర్ సీనియర్ అధికారి ఖండించారు. డేటా చోరీకి గురికాలేదని స్పష్టం చేశారు.


పాకిస్తానీ హ్యాకర్ల టెక్నిక్‌లు


పాకిస్తానీ హ్యాకర్లు మాల్వేర్ ప్రచారాలు, డిస్ట్రిబ్యూటెడ్ డినయల్-ఆఫ్-సర్వీస్ (డీడీఓఎస్) దాడులు, జీపీఎస్ స్పూఫింగ్‌ వంటి పద్ధతులను ఉపయోగించారని అధికారులు వెల్లడించారు. భారతీయ వెబ్‌సైట్‌లను డిఫేస్ చేసిన ఘటనలు కూడా నమోదయ్యాయని.. అయితే అనేక సైబర్ దాడులను తిప్పికొట్టి, దేశ కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించినట్లు మహారాష్ట్ర సైబర్ ఏడీజీపీ యశస్వి యాదవ్ తెలిపారు. పాకిస్తాన్‌ అనుకూల గ్రూపులు ఫేక్ న్యూస్‌తో హైబ్రిడ్ వార్‌ఫేర్ వ్యూహాన్ని అనుసరించాయని ఆ నివేదికలో వెల్లడించారు.


బ్యాంకింగ్ వ్యవస్థను హ్యాక్ చేశామని, విద్యుత్ అంతరాయాలకు కారణం తామేనని ఆ హ్యకింగ్ గ్రూపులు ఫేక్ ప్రచారం చేసినట్లు తెలిపారు. దేశ విద్యుత్ గ్రిడ్‌పై సైబర్ దాడులు, రాష్ట్రవ్యాప్త బ్లాక్‌అవుట్‌లు, శాటిలైట్ జామింగ్, ఉత్తర కమాండ్ అంతరాయం, బ్రహ్మోస్ క్షిపణి నిల్వ సౌకర్యంపై దాడి జరిగిందని అన్నీ తప్పుడు కథనాలు ప్రచారం చేశాయని పేర్కొన్నారు. భారత్-పాక్ ఉద్రిక్తతలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న 5వేల కంటే ఎక్కువ ఫేక్ న్యూస్‌ను మహారాష్ట్ర సైబర్ విభాగం గుర్తించి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.


భారతీయ వెబ్‌సైట్‌లపై దాడి చేసిన 7 పాకిస్తానీ హ్యాకర్ గ్రూపులు


మన దేశ వెబ్‌సైట్‌లపై దాడులు చేసిన 7 హ్యాకింగ్ గ్రూపులను సైబర్ అధికారులు గుర్తించారు. ఏపీటీ 36 (పాకిస్తాన్ ఆధారిత), పాకిస్తాన్ సైబర్ ఫోర్స్, టీమ్ ఇన్సేన్ పీకే, మిస్టీరియస్ బంగ్లాదేశ్, ఇండో హ్యాక్స్ సెక్యూరిటీ, సైబర్ గ్రూప్ హెచ్ఓఏఎక్స్ 1337, నేషనల్ సైబర్ క్రూ (పాకిస్తాన్‌కు అనుకూల) ఉన్నాయి. ఈ గ్రూపులు సమిష్టిగా భారతీయ మౌలిక సదుపాయాలపై దాదాపు 15 లక్షల సైబర్ దాడులు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com