ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత

national |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 08:12 PM

భారత వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ డైరక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మే 7వ తేదీ నుంచి ఈయన కనిపించకుండా పోగా.. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అతడు ప్రతిరోజూ కావేరీ నది ఒడ్డున ఉన్న సాయిబాబా ఆశ్రమానికి వెళ్లేవారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అక్కడే ఒడ్డుపై ఆయన బైక్ కనిపించగా.. అనుమానం వచ్చిన పోలీసులు నదిలో వెతికించారు. ఇలా కావేరీ నదిలో ఆయన మృతదేహం లభ్యం అయింది.


ప్రస్తుతం 70 ఏళ్ల వయసు కల్గిన సుబ్బన్న అయ్యప్పన్.. వ్యవసాయం మరియు మత్స్య (ఆక్వాకల్చర్) శాస్త్రవేత్త. 2010 జనవరి నుంచి 2016 ఫిబ్రవరి వరకు ఆయన భారత వ్యవసాయ పరిశోధనా మండలికి డైరెక్టర్ జనరల్‌గా, వ్యవసాయ పరిశోధనా విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శిగా సేవలు అందించారు. భారత దేశంలో "నీలి విప్లవం" తీసుకు వచ్చిన వ్యక్తిగా ఆయన ప్రశంసలు కూడా అందుకున్నారు. చేపల పెంపకంలో కొత్తకొత్త, మెరుగైన పద్ధతులను అందుబాటులోకి తీసుకు వచ్చి.. ఎంతో మంది మత్స్యకారులకు అండగా నిలిచారు. భారతదేశం చేపలను పెంచే మరియు పట్టుకునే విధానాన్ని కూడా మార్చారు.


అలాగే సుబ్బన్న అయ్యప్పన్.. భారత వ్యవసాయ పరిశోధనా మండలికి నాయకత్వం వహించిన మొదటి పంటయేతర శాస్త్రవేత్తగా కూడా గుర్తింపు పొందారు. ఇలా చాలా ఏళ్ల పాటు ప్రజల కోసం విపరీతమైన కృషి చేసిన ఈయన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే పద్మశ్రీ అవార్డును అందజేసి సత్కరించింది. ఇదిలా ఉండగా.. మైసూరులో తన కుటుంబ సభ్యులతో పాటు కలిసి ఉండే ఈయన మే 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు.. బంధువులు, స్నేహితుల అందరికి ఫోన్ చేసి అడిగారు. ఎక్కడా ఆయన ఆచూకీ లభించక పోవడంతో.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే ఆయన రోజూ ఎక్కడికి వెళ్తారు, ఏమేం చేస్తారు వంటివి అడగ్గా.. ఆయన దినచర్య గురించి కుటుంబ సభ్యులు చెప్పారు.


ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం సుబ్బన్న అయ్యప్పన్ శ్రీరంగపట్నం సమీపంలోని కావేరీ నది ఒడ్డున ఉన్న సాయిబాబా ఆశ్రమానికి ధ్యానం కోసం వెళ్లేవారని చెప్పగా.. పోలీసులు ఒకసారి అక్కడకు వెళ్లారు. ఈక్రమంలోనే అక్కడి నది ఒడ్డున ఆయన ద్విచక్ర వాహనం కనిపించింది. దీంతో అందులో ఏమైనా దూకి ఉంటారా అని అనుమానం రాగా.. స్థానిక మత్స్యకారులను పిలిపించి అందులో వెతికించారు. ఇలా సుబ్బన్న అయ్యప్పన్ మృతదేహం లభ్యం అయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆయన కావాలనే ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా అందులో తోసి హత్య చేశారా అనే విషయాలను మాత్రం తెలియరాలేదు. అయ్యప్పన్‌కు భార్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com