పహల్గాం ఉగ్రదాడితో భారత్ దాయాది దేశంపై ప్రతీకార చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఆ దేశానికి చెందిన ఉగ్రవాదులే అమాయక పర్యటకుల ప్రాణాలు తీసినట్లు గుర్తించి దౌత్యపరంగా ఒత్తిడి చేసింది. అలాగే ఆపరేషన్ సిందూర్ చేపట్టి చుక్కలు చూపించింది. దీంతో పాక్ కాళ్లబేరానికి రాగా కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. కానీ సింధూ నదీ జాలల ఒప్పందం రద్దును మాత్రం వెనక్కి తీసుకోలేదు. సోమవారం రోజు పాక్-భారత్ మధ్య చర్చలు జరిగినప్పటికీ ఈ విషయంపై ఇండియా క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవదానికి మద్దతు నిలిపి వేసే వరకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోమని అన్నారు.
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్.. దాని పర్యవసనాలను ఎదుర్కోక తప్పదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. ముఖ్యంగా భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన అమాయక ప్రజలను ఉగ్రవాదులు చంపేశారని గుర్తు చేశారు. అలాంటి వారికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్‌తో బంధం చాలా కష్టం అని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గం అని వెల్లడించారు. జమ్ము కశ్మీర్ విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మరోసారి పేర్కొన్నారు.
ద్వైపాక్షిక చర్చలు తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోదని కూడా రణ్‌ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. పీఓకేను పాకిస్థాన్ ఖాళీ చేసే అంశం మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. అయితే ఆపరేషన్ సిందూర్‌ను ఆపుతూ.. కాల్పుల విరమణపై తమ వైఖరిని స్పష్టంగా తెలియజేశామన్నారు. ప్రపంచ దేశాల నుంచి సంప్రదింపులు జరిపినా.. వారితో కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పామన్నారు. ఉగ్రవాదులను అణిచివేయడమే భారత్ తొలి ప్రాధాన్యం అని వివరించినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో కూడా ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు గుర్తు చేశారు.
అయితే దీనికి ప్రతిగా పాకిస్థాన్ ప్రతిదాడులకు పాల్పడిందని.. ప్రతిచర్యగానే భారత్ కూడా దాడులు చేసిందని రణ్‌ధీర్ జైశ్వాల్ వివరించారు. వాళ్లు కాల్పులు ఆపేస్తే తాము కూడా ఆపేస్తామని ముందే చెప్పామని.. అదే చేసి చూపించామన్నారు. అలాగే సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు గురించి మాట్లాడుతూ.. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఆపితేనే తాము రద్దును ఆపేస్తామని వెల్లడించారు. పాక్ ఎంత కాలం వారిని పెంచి పోషించుకుంటూ వస్తే తాము కూడా అంతే కాలం సింధూ నదీ జలాల రద్దును కొనసాగిస్తామన్నారు.
![]() |
![]() |