బీహార్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ లపై ధ్వజమెత్తారు. దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్‌లో విద్యార్థులతో 'శిక్షా న్యాయ్ సంవాద్' పేరిట తలపెట్టిన ముఖాముఖి కార్యక్రమానికి వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఆటంకాలను అధిగమించి హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ, బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను పోలీసులు హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా నిలువరించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినప్పటికీ, రాహుల్ గాంధీ పట్టువీడకుండా, పోలీసుల అడ్డంకులను దాటుకుని హాస్టల్‌లోకి ప్రవేశించారు. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని "డబుల్ ఇంజిన్ ధోకాబాజ్ సర్కార్" డబుల్ ఇంజిన్ మోసపూరిత ప్రభుత్వం అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లను ఉద్దేశించి రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. "నితీశ్ జీ, మోదీ జీ, ఆపగలిగితే ఆపండి. కులగణన తుఫాను సామాజిక న్యాయం, విద్య, ఉపాధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది," అని ఆయన హిందీలో ఎక్స్ వేదికగా పేర్కొన్నారు."బీహార్ పోలీసులు నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారు నన్ను ఆపలేకపోయారు, ఎందుకంటే మీ మైనారిటీ వర్గం శక్తి నన్ను కాపాడుతోంది. దేశంలో కులగణన చేపట్టాలని మేము ప్రధాని మోదీకి చెప్పాం. మీ ఒత్తిడి వల్లే ప్రధాని మోదీ కులగణన ప్రకటించారు. మీ ఒత్తిడికి భయపడి ఆయన రాజ్యాంగాన్ని నుదుటిపై పెట్టుకున్నారు. కానీ వారి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, మైనారిటీలకు వ్యతిరేకమైనది. ఇది అదానీ-అంబానీల ప్రభుత్వం, మీది కాదు," అని రాహుల్ గాంధీ ఆరోపించారు. "భారత్‌లో, బీహార్‌లో మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, మీకు దక్కాల్సినవన్నీ అమలు చేస్తామని నేను హామీ ఇస్తున్నాను," అని ఆయన తెలిపారు.ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రశ్నిస్తూ, "బీహార్‌లోని ఎన్డీయే 'డబుల్ ఇంజిన్ ధోకాబాజ్ సర్కార్' నన్ను అంబేద్కర్ హాస్టల్‌లో దళిత, వెనుకబడిన విద్యార్థులతో సంభాషించకుండా అడ్డుకుంటోంది. విద్యార్థులతో మాట్లాడడం ఎప్పటి నుంచి నేరంగా మారింది నితీశ్ జీ, మీరు దేనికి భయపడుతున్నారు బీహార్‌లో విద్య, సామాజిక న్యాయం పరిస్థితిని దాచిపెట్టాలనుకుంటున్నారా అని రాహుల్ గాంధీ ఎక్స్‌లో నిలదీశారు. "భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఇది రాజ్యాంగం ద్వారా నడుస్తుంది, నియంతృత్వం ద్వారా కాదు! సామాజిక న్యాయం, విద్య కోసం మా గొంతును వినిపించకుండా ఎవరూ మమ్మల్ని ఆపలేరు," అని ఆయన మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.
![]() |
![]() |